Warangal News: తల్లితో గొడవపడుతున్న నానమ్మను 14 ఏళ్ల బాలుడు పొడిచి చంపేశాడు. జనగామ జిల్లాలో ఉప్పుగల్లులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పుగల్లుకు చెందిన మానస (పేరు మార్చాం) భర్త పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో అత్తమామల వద్దే ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నాలుగు రోజులుగా అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం కూడా అత్తతో కోడలు గొడవ జరిగింది. గొడవలు రోజూ ఇద్దరు పిల్లల ముందే జరుగుతుండడంతో చిన్న మనవడు (14) తీవ్రంగా కలత చెందేవాడు. 

Continues below advertisement


అతను ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కోపానికి గురైన బాలుడు ఓ కత్తితో తన నానమ్మ ఛాతీలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చిన్న పిల్లాడు కావడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఆనోటా, ఈ నోటా ఈ విషయం ప్రచారం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.


(ఈ వ్యవహారంలో నిందితుడు మైనర్ అయినందున అతని ఆచూకీ తెలిపే అన్ని వివరాలను నిబంధనల ప్రకారం గోప్యంగా ఉంచాల్సి వచ్చింది)