Vizianagram Crime News: సంక్రాంతి పండగకు సరుకులు ఇప్పిస్తానని చీటీలు కట్టించిన వాలంటీర్​ మోసానికి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బాధితులకు కుచ్చు టోపీపెట్టింది. ‌విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. చీటీల పేరుతో 1250 మందికి ఆమె టోకరా వేసింది. జిల్లాలోని గుర్ల మండలం ఎస్​ఎస్​ఆర్​పేటకు చెందిన పతివాడ శ్రీలేఖ నెలిమర్ల మండలం కొండగుంపాం గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఎస్​ఎస్​ఆర్​పేటలో నెలకు రూ.300 చొప్పున వసూలు చేసింది. ఏడాది అంతా కడితే సంక్రాంతి పండగకు సరిపడా సరకులు ఇస్తానని నమ్మబలికింది. ఈ సరుకులలో బియ్యం మొదలుకుని పప్పుల వరకు పండగకు ఉపయోగపడే సామన్లు ఉంటాయని తెలిపింది. నిజమని నమ్మిన చాలామంది చీటీలు కట్టేందుకు ముందుకు వచ్చారు. 




శ్రీలేఖతో పాటు మేనమామ కొడుకు అప్పలరాజు కూడా భాగస్వామి


శ్రీలేఖతోపాటు కొండకరకాం గ్రామంలో ఉండే ఆమె మేనమామ కుమారుడు మజ్జి అప్పల రాజు కూడా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన పలువురు ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ చీటీలు కట్టించాడు. క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రిస్టియన్లు తమకు పండగ సామాగ్రి ఇవ్వాల్సిందిగా వారిని కోరారు. రేపు, మాపు అంటూ నిర్వాహకులు తప్పించుకుని తిరిగారు. వారి వద్ద నుంచి ఒత్తిడి పెరగడంతో నిర్వహకులు పరారయ్యారు. ఆమె సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంటి వద్ద కూడా ఆందోళనకు దిగారు. దాదాపు 4.50 కోట్ల రూపాయల దాకా వసూలు చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.




100 రూపాయల కమీషన్ ఇస్తామంటూ వాలంటీర్లకు ఆశ


వీరి చేతుల్లో మోసపోయిన బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో సభ్యులను చేర్పించడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఒకరిని చేర్పిస్తే రూ .100 కమీషన్ ఇస్తామనడంతో కొందరు వాలంటీర్లు ఏజెంట్లుగా చేరినట్లు సమాచారం. వారికి కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన వారిని చేర్పించినట్లు తెలుస్తోంది.


"మా ఇంటి పక్కనే ఉంటూ మోసానికి పాల్పడింది. నాతోపాటు నా మిత్రుల దగ్గరి నుంచి చీటీలు కట్టించింది. నాకు తెలిసిన వారందరి చేత నేను కట్టించాను. ఇప్పుడు వాళ్లందరూ నన్ను అడుగుతున్నారు. నెలనెలా వసూలు కాకపోతే సరకులు రావని చెప్పేది." అని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.


మానసనే 19 లక్షలు కట్టించింది.. పాపం!


శ్రీలేఖ మా వాలంటీరు కావడంతో ఆమె చెప్పిన మాటలు నమ్మి 521 మంది సభ్యులతో సుమారు 19 లక్షల రూపాయలు కట్టించానని.. నెలవారీ కట్టిన సొమ్ముకు ఆమె సంతకం చేసి రసీదులు ఇచ్చిందని కొండగుంపాం గ్రామానికి చెందిన మానస తెలిపింది. మీ డబ్బుకు నాది బాధ్యత అంటూ చెప్పిందని, నమ్మినందుకు నిలువునా ముంచిందని వాపోయింది.