విశాఖపట్నం: విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ప్లాస్టిక్ డ్రమ్ లో కుళ్లిపోయిన స్థిలో మహిళ మృతదేహం కనిపించడం తెలిసిందే. రిషి అనే వ్యక్తి ఈ మహిళను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. మృతురాలని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బమ్మిడి ధనలక్ష్మి గా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు కస్టడీ కి తీసుకుని విచారిస్తున్నారు.


బస్టాండ్‌లో పరిచయం, ఓసారి రూమ్‌కు తీసుకొచ్చి.. 
ఏడాదిన్నర కిందట శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషికి, ధనలక్ష్మి కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మధురవాడలో అద్దెకు ఉన్న ఇంటికి ఓసారి ఆమెను తీసుకువచ్చి శారీరకంగా కలిశాడు రిషి. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని డబ్బులు డిమాండ్ చేసేది ధనలక్ష్మి. కొంతకాలానికి విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని ఆందోళన చెందిన రిషి.. చున్నీని మెడను బిగించి ధనలక్ష్మిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన రిషి ఆ తరువాత మృతదేహాన్ని నీటి డ్రంలోకి మార్చాడు. ఇంటి యజమానికి భార్య డెలివరీ కి వెళ్ళింది వచ్చిన తర్వాత అద్దె చెల్లిస్తామని దాటవేస్తూ వచ్చాడు నిందితుడు.


ఏడాది నుంచి అద్దె రాకపోవడం, ఇల్లు కూడా ఖాళీ చేయక పోవడంతో సామాన్లు బయటికి పడేసేందుకు ఇంటి ఓనర్ రమేష్ వెళ్లి చూసి షాకయ్యాడు. ఊహించని విధంగా మహిళ హత్య జరిగిన విషయాన్ని గుర్తించాడు రమేష్.  తీసేందుకు రమేష్ వెళ్లడంతో బయటపడ్డ హత్య. పోలీసులకు ఇంటి ఓనర్ సమాచారం అందించడంతో హత్య విషయం వెలుగుచూసింది. ధనలక్ష్మి మృతదేహాన్ని బయటకు తరలించలేక నిందితుడు ఇంట్లోని నీటి డ్రంలో వదిలేసినట్టు భావిస్తున్నారు. మృతురాలు ధనలక్ష్మి గా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు పంపిస్తున్నాం అని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ శ్రీకాంత్ చెప్పారు.


డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేయలేదు.. 
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో విశాఖలోనూ మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్. తనకు శ్రీకాకుళం జిల్లాలో పరిచయమైన మహిళను తన గదికి తీసుకువచ్చాడని ఆపై జరిగిన పరిణామాలతో హత్య జరిగిందన్నారు. క్లూస్ టీం వేలిముద్రల్ని సేకరించింది. మహిళ డెడ్ బాడీ కుళ్లిపోయి కనిపించిందని తెలియగానే పోలీసులు 5 టీమ్‌లుగా ఏర్పడి విశాఖ నగరంతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాలించి చివరకు నిందితుడు రిషిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తల భాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలిందని, చుట్టుపక్కల వారికి వాసన ఎందుకు రాలేదు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన ధనలక్మి శ్రీకాకుళం నుంచి వచ్చేసి చాలా రోజులు గడిచినా ఎవరూ ఆమె గురించి వెతకడం లేదన్నారు.


అసలేం జరిగిందంటే..
విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. వాటర్ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించింది. ఇది గమనించిన ఇంటి ఓనర్ భయాందోళనకు గురయ్యాడు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మహిళను హత్య చేసి కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంటి ఓనర్, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పిఎంపాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 24 గంటలు గడవకముందే నగరంలో రెండు హత్యల సంఘటనలు జరగడంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు.