Bhadradri News : పెంపుడు కుక్కుల్ని ఇళ్ల దగ్గర బయటకు తీసుకు వస్తేనే చాలా మందికి కోపం వస్తుంది.. అది ఎక్కడ తమ ఇంటి ముందు గబ్బు చేస్తుందోనని ఆ ఇళ్ల ఓనర్ల ఆందోళన. ఒక వేల అలా చేసినా కేసులు పెట్టలేరు. మనసులో తిట్టుకోవడమో.. లేకపోతే వారితో గొడవపడటమో చేస్తారు. కానీ స్టేషన్ వరకూ వెళ్లరు. అదే రోడ్లపై తిరిగే మూగజీవాలు రోడ్డుపైనే మూత్రంతో పాటు అన్నీ కానిచ్చేస్తాయి. అది వాటికి జన్మహక్కు. ఎందుకంటే వాటికి ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండవు. కానీ భద్రాద్రిక కొత్తగూడెంలో ఓ ఎద్దు యజమానికి మాత్రం.. పెద్ద చిక్కొచ్చి పడింది. తన ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని ఆయన కేసును భరించాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే ?
ఎద్దుల బండి కిరాయికి తిప్పుకుని పొట్ట నింపుకునే సుందర్ లాల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ నాలుగు పైసలతో కుటుంబాన్ని పోషించు కుంటున్నా డు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. ఎక్కడ పోయాలో దానికి తెలియదు. వచ్చింది పోసేసింది. ఆపడం యజమానికి కూడా సాధ్యం కాదు. కానీ అలా పోయడం... సింగరేణి జీఎం కార్యాలయం సిబ్బందికి నచ్చలేదు. అలాగని ఎద్దు ఓనర్‌తో గొడవపడలేదు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్యాలయం ఎదుట సుందర్ లాల్ ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టిన సింగరేణి అధికారులు
సింగరేణి జీఎం చెబితే కేసు పెట్టమా అని పోలీసులు కూడా వెంటనే.. కేసు నమోదు చేశారు. వెంటనే ఎద్దు యజమానిక అయిన సుందర్ లాల్ ను స్థానిక పోలీసులు పిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు. పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్.. అని అడిగాడు.. దీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించాలని ఆదేశించారు. చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదనతో చెప్పారు..కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు.
ఫైన్ వేసిన న్యాయమూర్తి - కట్టిన ఓ కానిస్టేబుల్
పోలీసులు న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయడంతో.. న్యాయమూర్తి కూడా ఫైన్ విధించినట్లుగా తెలుస్తోంది. సుందర్ లాల్ బాధను చూసి.. ఫైన్ కూడా.. స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇచ్చారు. ఫైన్ కట్టడానికి పోలీసులు సహాయం చేశారని సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళన గురి చేశారని సుందర్ లాల్ వాపోయాడు. తనపై కేసు పెట్టి ఫైన్ వేయాలంటే.. రోజూ .. కొన్ని వేల పశువులకు వేయాలని ఆయన మండిపడుతున్నారు.