Visakha News : దేశంలోనే అత్యున్నత కొలువు సాధించాలని విశాఖ నగరానికి చేరుకున్న యువత పెడదారిపట్టారు. చదువు పక్కన పెట్టి జల్సాలతో అడ్డదారులు తొక్కారు. చివరికి ఆ చెడు మార్గాలే ప్రాణం తీసుకునేలా చేశాయి. విశాఖ ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో విశాఖ వచ్చింది. ఎంవీపీ కాలనీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో చేరింది. ఇదే కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఆమె కోచింగ్‌కు వెళుతోంది. దివ్యకు ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డితో పరిచయం ఏర్పడింది.
జల్సాలకు అలవాటు పడి
వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అయితే వెంకటేశ్వరరెడ్డి అప్పటికే జల్సాలకు అలవాటు పడి తెలిసిన వారందరి దగ్గర పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కోచింగ్ పేరుతో ఐదేళ్లుగా అతడు విశాఖలోనే ఉంటున్నాడు. వెంకటేశ్వరరెడ్డి మాయమాటలు నమ్మిన దివ్య... తన సివిల్స్ లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. తమ కూతురు సివిల్స్ చదువుతోందని ఎంతో నమ్మకం పెట్టుకున్న దివ్య తల్లిదండ్రులు ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపించేవారు. ఇలా భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది దివ్య. ఇక్కడితో ఆగకుండా స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది.
మేనమామ వస్తానని చెప్పడంతో
వెంకటేశ్వరరెడ్డి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి డబ్బులు కావాలని కోరింది. ఈ వ్యవహారంపై మేనమామకు అనుమానం రావడంతో అవసరం ఏంటని ప్రశ్నించాడు. తానే స్వయంగా విశాఖ వచ్చి ఇస్తానని చెప్పాడు. మేనమామ విశాఖ వస్తే అప్పటికే స్నేహితులు, బంధువుల వద్ద అప్పుల వ్యవహారం బయటపడుతుందేమోనని దివ్య భయపడింది. బుధవారం తన మేనమామ విశాఖ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా నోట్ రాసి సూసైడ్ చేసుకుంటున్నట్లు తన బంధువులు, తల్లిదండ్రులకు వాట్సప్ మెసేజ్ పంపించింది.
క్షమించమని సూసైడ్ నోట్
కుటుంబ పరిస్థితి తెలిసి కూడా తన తల్లిదండ్రులను తలదించుకునేలా చేశానని అందుకు క్షమించాలని సూసైడ్ నోట్‌లో దివ్య రాసింది. దివ్య రాసిన సూసైడ్ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు గురువారం రుషికొండ తీరానికి కొట్టుకొచ్చిన ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం అంశంపై దృష్టిసారించారు. ఆ మృతదేహం వెంకటేశ్వరరెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. దివ్య కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. ఈ రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.