TDP On Madhav :  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫోరెన్సిక్ టెస్ట్ చేయించకుండానే .. అది ఒరిజినల్ కాదని చెప్పారని.. తాము అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించామని  టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రకటించారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిర్వహించిన టెస్టులో ఆ వీడియో పూర్తి స్థాయిల ఒరిజినల్ అని తేలిదంన్నారు. అలాగే ఎలాంటి ఎడిటింగ్ లేదని కూడా స్పష్టమైందన్నారు. ఆ నివేదికను పట్టాభిరాం ప్రదర్శించారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఎంపీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఎంపీపై చర్యలు చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.  . ‘ మిస్టర్ జగన్‌రెడ్డి   ఇది సరిపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవడానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా’’ అని పట్టాభి ప్రశ్నించారు. 



ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?


నీచానికి పాల్పడిన ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా  జాతీయ జెండా ఎగురవేసే అర్హత జగన్‌కు ఉండదని పట్టాభిరం స్పష్టం చేశారు. మహిళళకు  భద్రత కల్పించలేని జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్నారు. చేసిందంతా చేసి కులం అడ్డుకు పెట్టుకుంటున్నారని.. జంతువు లాంటి మాధవ్‌కు కులం ఉండదని పట్టాభిరాం వ్యాఖ్యానించారు. ఎంపీ మాధవ్‌పై చర్య తీసుకోకుండా అమెరికా ఫోరెన్సిక్‌ రిపోర్టును రాష్ట్రపతితో పాటు ప్రధాని, లోక్‌సభ స్పీకర్ , కేంద్ర హోంశాఖ దృష్టికే తీసుకెళ్తామని హెచ్చరించారు. మాధవ్‌పై చర్య తీసుకునేలా వైఎస్ భారతి . . జగన్‌కు జ్ఞానోదయం కల్పించాలని పట్టాభి సూచించారు. 



పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు !


తప్పు చేసిన మాధవ్  పోలీసులను అడ్డంపెట్టుకుని తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని అందుకే అమెరికా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో వీడియో టెస్ట్‌‌ చేయించినట్లు తెలిపారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి దీనికేం మాట్లాడతారన్నారు.  అనంతపురంలో మాధవ్‌ సిగ్గులేకుండా హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని.. మాధవ్‌ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని వరిమర్శించారు.  


మాధవ్‌ను మహిళా మంత్రులు సమర్థించడం సిగ్గు చేటు : అనిత


మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగు మహిళ అధ్యక్షురాలు అని.. అనంతపురం ఎస్పీ అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును పరిశీలించాలన్నారు. అనంతపురం ఎస్పీ మాధవ్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో దొరకలేదని చెప్పారన్నారు. మాధవ్‌ విషయంలో చర్యలు తీసుకోకుండా మహిళల మనోభావాలకు భంగం కలిగించారని జగన్‌పై అనిత మండిపడ్డారు. మాధవ్ లాంటి ఎంపీని ఎందుకు ప్రోత్సాహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వొద్దని అనిత పిలుపునిచ్చారు. మాధవ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్‌సీపీ మహిళా మంత్రులు కూడా వెనుకేసుకు రావడం దారుణమన్నారు.