Crime News :  దొంగలు కూడా ఇప్పుడు రాటుదేలిపోయారు. రోడ్డు మీద కనిపిచిన వారిని దారి దోపిడీ చేయడం కన్నా ప్లాన్ చేసుకుని మరీ దోపిడీలు చేయడం ఎక్కువైపోయింది. కొన్ని ముఠాలు ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇళ్లను సర్వే చేసి..రెక్కీ నిర్వహించి.. సేఫ్‌గా దొంగతనాలు చేసి చెక్కేస్తున్నారు ఇలాంటి ముఠా ఒకదాన్ని గుంటూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారు దొంగతనాలు ఎలా చేసేవాళ్లో తెలిస్తే.. ఇళ్లకు తాళాలేసి .. పనులు చక్కబెట్టుకుంటానికి వెళ్లే వాళ్లకి చెమటలు పట్టక తప్పదు. ఎందుకంటే.. తాళాలేసిన ఇళ్లల్లో ఎంత దర్జాగా వాళ్లు దొంగతనం చేసుకెళ్తారో గుంటూరు జిల్లా పోలీసులు వివరించారు.


గుంటూరులో పెరిగిన ఇళ్ల దొంగతనం కేసులు


ఇటీవల గుంటూరు టౌన్‌లో దొంగతనం కేసులు తరచూ వస్తున్నాయి. తాళం వేసి బయటకు వెళ్లామని వచ్చే సరికి ఇల్లు గుల్ల చేశారన్న కంప్లైట్లు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చాయి. దీంతో ఇదంతా వేర్వేరు దొంగలు చేస్తున్న పని కాదని.. ఒకే ముఠా పని అని పోలీసులు గుర్తించారు. దొంగతనాలు జరిగిన అన్ని ప్రాంతాల్లో దొరికిన సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు. పెద్దగా అనుమానాస్పదమైనవి ఏమీ దొరకలేదు. కానీ.. అన్ని చోట్ల సీసీ టీవీ ఫుటేజీలో దుప్పట్లు అమ్మేవాళ్లు కనిపించారు. దాదాపుగా అందరూ ఒకే రకంగా దుప్పట్ల అమ్మకాల కోసం తిరుగుతున్నారు. 


దుప్పట్లు అమ్మకం దారుల వేషంలో దొంగలు


దీంతో పోలీసులు ఇందులో ఏదో మతలబు ఉందని అనుమానించారు. ఆ దుప్పట్లు అమ్మేవాళ్లు ఎక్కడుంటారో ఆరా తీశారు. చివరికి ఇలాగే ఓ వీధిలో దుప్పట్ల అమ్మకాలు చేస్తూ కనిపించారు. వారిని ఫాలో అయితే.. అసలు దుప్పట్ల అమ్మకాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. అమ్మేందుకు కూడా పెద్దగా ప్రయత్నించడం లేదు. ఇంకేదో చూస్తున్నారని పోలీసులకు అర్థమైంది. అదేమిటంటే.. వాళ్లు చేసేది తాళం వేసిన ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెదుక్కోవడం. దాంతో పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది. అసలు దొంగలు వాళ్లేనని నిర్ధారణకు వచ్చారు.  పక్కాగా ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాలు చెప్పేశారు.


తెలంగాణలో కూడా ముఠాపై పలు కేసులు


ఈ ముఠా ఉత్తరప్రదేశ్ నుంచి గుంటూరు వచ్చిందని ఎస్పీ అరిఫ్ ప్రకటించారు.  పగలు దుప్పట్లు అమ్ముతున్నట్లు నటిస్తూ తాళాలు  వేసీన  ఇళ్ళను టార్గెట్ చేసేవారని ప్రకటించారు. గ్యాంగ్‌లో ముగ్గురు దొరకగా మరికొంత మంది పరారీలో ఉన్నారని తెలిపారు.  తెలంగాణాలో‌ వీరిపై పలు కేసులు ఉన్నాయని..   గుంటూరు‌ టౌన్లో వీరిపై ఎనిమిది  కేసులున్నాయని ఎస్పీ అరిఫ్ తెలిపారు. అన్ని కేసులూ ఇంటి తాళాలు బద్దలు కొట్టి దొంగతనం చేసినవేనన్నరాు.  వీరి నుంచి రూ.7.8 లక్షల విలువైన చోరీ  సొత్తును, రూ.1.2 లక్షల‌ నగదు.స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. అందుకే ఇలాంటి దుప్పటి దొంగలు కూడా ఉంటారు కాబట్టి.. తాళం వేసిన ఇళ్ల యజమానులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.