సాధారణంగా బుల్లెట్ బండి ధర ఎంత ఉంటుంది ?.  కొత్తది అయితే రూ. రెండు లక్షలు. పాతదైతే ఎలా లేదన్నా రూ . లక్ష గ్యారంటీ. ఇంకా పాతదైదే.. రూ. నాలుగైదు లక్షలకు అమ్ముతారు.. అది వేరే విషయం. బుల్లెట్ బండికి ఉన్న క్రేజ్ అలాంటిది. అలాంటి బుల్లెట్ బండిని.. అలాంటి ఖరీదైన ఇతర బ్రాండ్ల బండ్లను రూ. ఇరవై వేలకు ఇస్తామని వస్తే కాస్త తేడాగా చూడాల్సిందే. అలా చూడకుండా కొనుక్కుంటే చివరికి బుల్లెట్ బండి దక్కదు.. ఆ రూ. ఇరవై వేలు కూడా వదులుకోవాల్సిందే. బోనస్‌గా కేసులు వచ్చి పడినా ఆశ్చర్యం లేదు.


విశాఖలో ఇటీవలి కాలంలో ఖరీదైన బైక్‌లు మాయం అవడం ఎక్కువయింది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లే కాదు రూ. రెండులక్షల వరకూ విలువ చేసే ఖరీదైన వాహనాలను చాక చక్యంగా కొట్టేస్తున్నారు. అవి ఎక్కడకు పోతున్నాయో పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇసుక బస్తాలు వేసుకుని పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్తున్నామోనని నిఘా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. కానీ ఇలా కొట్టేసిన బండ్ల మీద ఇసుక చల్లడానికి పక్క  రాష్ట్రానికి వెళ్లడం చాలా పాత మోడల్. అందుకే ఎవరికీ తెలియని దారుల్లో ఎవరికీ చిక్కకుండా వెళ్లడం కొత్తమోడల్. అలాగే వెళ్తున్న దొంగలు.. ఆ రాష్ట్రంలో అమ్మేస్తున్నారు.


విశాఖ నుంచి ఖరీదైన వాహనాలను కొట్టుకెళ్తున్న దొంగలు.. అడ్డ రోడ్ల ద్వారా ఒరిస్సాకు తీసుకెళ్తున్నారు. అక్కడకు వెళ్లి నెంబర్ ప్లేట్లు తీసేసి అమ్మకానికి పెట్టేస్తున్నారు. అదీ కూడా మరుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి.. బండికి పేపర్లు ఏమీ ఉండవు.. అందుకే రూ .  తక్కువకు అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటారు. కావాల్సిన వాళ్లు వచ్చి డబ్బులిచ్చి బండి పట్టుకుపోవడమే. ఇలా పదుల సంఖ్యలో వాహనాలను అమ్మేశారు. రూ. ఇరవై వేలకే బుల్లెట్ బండి కొనేసుకుని.." బుల్లెట్ బండి తీసుకొచ్చేత్తా...పా " అని పాడుకుంటూ ఇంటికి వెళ్లిన వాళ్లకు ఎక్కువ రోజులు ఆనందం మిగల్లేదు. అంతే బుల్లెట్ వేగంతో పోలీసులొచ్చి తీసుకెళ్లిపోయారు. ఎందుకటే వీరికి బండ్లు అమ్మిన ముఠా దొరికిపోయింది మరి.


దొంగల ముఠా ఒడిశా కోరాపుట్ జిల్లా జయపురం  సబ్ డివిజనల్ లోని  పత్రోపుట్ గ్రామానికి వారు. వీరు విశాఖ జిల్లాలోకి వచ్చి వాహనాలను తీసుకుని ఒరిస్సాకు తీసుకెళ్లి కారు చవకగా అమ్మేస్తున్నారు.  ఈ కేసు లో ఆంధ్ర పోలీసులకు ఒడిశా జయపురంచెందిన పోలీసులు సహకరించారు. ఈ ముఠా దొంగతనం చేసి అమ్మేసిన 14 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.