విశాఖ జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ముఠా కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా... ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆ కారును వెంబడించారు. సినిమాలో లాగా గంజాయి గ్యాంగ్ కారును పోలీసులు ఛేజ్ చేశారు. పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్లిన గంజాయి స్మగ్లర్లు దారిలో అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ పది నిమిషాల పాటు పట్టణంలోని అబీద్ సెంటర్ నుంచి పెద బొడ్డేపల్లి వరకు అలజడి సృష్టించారు.
పోలీసుల ఛేజ్ పై స్థానికుల ప్రశంసలు
విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు కారులో మహారాష్ట్ర తీసుకెళ్లే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే కారణంతో వీరు కారును వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీనిని గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్.ఐ దివాకర్ తన బందోబస్తుతో కలిసి కారును వెంబడించారు. పోలీసుల నుంచి బయటపడేందుకు కారును వేగంగా నడిపారు. దీంతో స్థానిక అబీద్ సెంటర్లో వృద్ధురాలికి ఢీకొట్టారు. శ్రీకన్య సెంటర్లో ఏర్పాటు చేసిన బారీగేట్లను గుద్దుకుని, పెద బొడ్డేపల్లి వైపు అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ వెళ్లారు. ముందు స్మగ్లర్లు, వారిని వెంబడిస్తూ పోలీసులు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ సినిమాలో ఛేజింగ్ సీన్ ను తలపించారు. పోలీసులు కారును వెంబడిస్తుండటంతో పట్టుబడక తప్పదని గ్రహించిన స్మగ్లర్లు కారును వదిలి బొడ్డేపల్లి వంతెన కింద కాలువలోకి దూకేశారు. అప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున చేరడంతో పాటు పోలీసులు రావడంతో వారికి పట్టుకున్నారు. పోలీసుల సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
Also Read: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్
గంజాయి గ్యాంగ్ కొంతదూరం వెళ్లాక కారును వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి కాలువలో దూకేశారు. మరో గంజాయి నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు, స్థానికులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో అతడు కూడా చిక్కాడు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సినిమా ఛేజింగ్ ను తలపించేలా ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. కారు అతివేగంగా రోడ్డు మీద అన్నింటిని గుద్దుకు వెళ్లడాన్ని చూసి ఏదో సినిమా షూటింగ్ అనుకున్నామని కానీ పోలీసులు వెనకబడడంతో అసలు విషయం తెలిసిందన్నారు. కానీ కొన్ని గంటల పాటు గంజాయి స్మగ్లర్లు కారుతో బీభత్సం సృష్టించారని స్థానికులు అంటున్నారు. అడ్డొచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారని, ఓ వృద్ధురాలికి గాయాలయ్యాయని తెలిపారు.