తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ నెల 30 వరకు సెలవులను పొడిగించింది ప్రభుత్వం. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా... సీరియస్ కేసులు లేకపోవడం, త్వరగానే నయంఅవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తుంది.  దీంతో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 31 నుంచి, లేదా ఫిబ్రవరి రెండో వారం నుంచి తరగతులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పిల్లలను పాఠశాలలకు పంపాలా, ఆన్‌లైన్‌ తరగతులు ఎంచుకోవాలా? అనేది తల్లిదండ్రులకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.  


Also Read:  ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏయే రోజుల్లోనంటే!


ఆన్ లైన్ క్లాసులు 


కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల‌ను 30వ తేదీ వరకూ పొడ‌గించింది. క‌రోనా కేసులు భారీగా పెరిగిన కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు సెలవుల‌ను పొడగించింది. అయితే విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత సోమ‌వారం నుంచి 8, 9, 10 త‌ర‌గతుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాల‌ని ఆదేశించింది. అయితే మరో ఐదు రోజుల్లో సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష త‌ర‌గ‌తుల‌ను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఐదు రోజుల్లో కేసులు సంఖ్య భారీగా పెరిగినా, ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోయినా సెల‌వులు మ‌రో వారం పొడిగించి ఆ తర్వాత స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. 


మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన


త్వరలోనే పాఠశాలలు తిరిగి తెరుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 50 శాతం మంది టీచర్లతో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యాసంస్థల తిరిగి ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జనవరి 30 తర్వాత విద్యాసంస్థలు తెరవాలా? వద్దా? అనేది 30వ తేదీ నాటికి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులు నష్టపోకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు టీశాట్ ద్వారా తరగతులు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  


Also Read: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్