Viral News: ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో గత జులై 29న మూడు అనుమానాస్పద మరణాలు సంభవించాయి. అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బుధవారం ఆస్ట్రేలియన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వారికి ఎటువంటి క్లూ దొరకడం లేదు. కేసు చిక్కుముడి వీడడం లేదు.


కానీ పోలీసులు మాత్రం ముగ్గురు వ్యక్తులు ఎలా చనిపోయారు? ఇద్దరు ఆస్పత్రిలో ఉండడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అదే రోజు ఇంట్లో వంట చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. తరువాత ఆమెపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. అయితే ఆమె ప్రవర్తనపై మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే
విక్టోరియా రాష్ట్రం లియోంగథా పట్టణానికి చెందిన ఓ మహిళ జులై 29న తన 70 ఏళ్ల అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, భర్త ఇయాన్ విల్కిన్సన్, పిన్ని వరుస అయ్యే హీతర్ విల్కిన్సన్, పాస్టర్‌కు విందుకు పిలిచింది.  రకరకాల వంటలతో పాటు పుట్టగొడుగులతో స్పెషల్ వండి వడ్డించింది. ఆ ఆహారం తిన్న నలుగురిలో మహిళకు చెందిన అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, వారి బంధువు హీతర్ విల్కిన్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భర్త ఇయాన్ విల్కిన్సన్, బాప్టిస్ట్ పాస్టర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. 


స్థానికంగా కలకలం రేపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అదుపులోకి విచారణ చేశారు. అయితే అసలేం జరిగిందో తనకు తెలియదని మహిళ సమాధానం ఇచ్చింది.  తాను ఏం చేయలేదని, తన అత్తామామలు చనిపోయినందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పారు. అతిథులకు ఎలాంటి భోజనం పెట్టారు? పుట్టగొడుగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడానికి మహిళ నిరాకరించింది. 


కేసు గురించి విక్టోరియా పోలీస్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ మాట్లాడుతూ.. చనిపోయిన వారు ఏ రకమైన పుట్టగొడుగులను తిన్నారో స్పష్టంగా తెలియదన్నారు. వారి మరణం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలియడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.


అనుమానిత మహిళ తన భర్త నుంచి విడిపోయిందని, అయితే వారి మధ్య స్నేహం కొనసాగతోందని థామస్ చెప్పారు. మధ్యాహ్న భోజనం సమయంలో ఆమె పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని, వారు ఆ భోజనం తినలేదు. దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, మహిళ ఎందుకు ఆహారం తినలేదనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. గత శనివారం పోలీసులు మహిళ ఇంట్లో సోదాలు జరిపారు.  పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించేందుకు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు చెప్పారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial