తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారు కొట్టుకుపోయిన ఘటనలో  వాగులో కొట్టుకుపోయారని అనుకున్న ఇద్దరిలో డ్రైవర్‌ రాఘవేందర్‌ బతికే ఉన్నారు. గల్లంతైనట్లు భావించి ఉదయం నుంచి డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, బాలుడు త్రిషాంత్‌ కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా రాఘవేందర్‌ చెట్టుకొమ్మను పట్టుకుని బయటపడిన విషయం వెలుగులోకి వచ్చింది.


ఇవాళ ఉదయం 5 గంటలకు రాఘవేందర్‌ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ సంజీవరావు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి మృతదేహాలను పోలీసులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. అయితే డ్రైవర్‌ రాఘవేందర్‌ ఉదయం 5 గంటలకే ఇంటికి చేరుకున్నప్పటికీ పోలీసులు బయటపెట్టక పోవడంతో మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..


వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారులో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి గుర్తించారు. బాలుడు ఇషాంత్‌ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరోవైపు కొత్తపల్లి వాగులో కోట్టుకుపోయిన కారులో ఉన్న వృద్ధుడు వెంకటయ్య(70) మృతదేహం కూడా లభ్యమైంది.


ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మోమిన్‌ పేట నుంచి రావుల పల్లికి వెళ్తుండగా మధ్యలో వాగు ప్రవాహ తాకిడికి కారు కొట్టుకుపోయింది. వంతెన పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో డ్రైవర్ వద్దన్నా వినకుండా అలాగే కారును ముందుకు పోనివ్వడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. మొత్తం ఆరుగురు కారులో ఉండగా.. ఇద్దరు తప్పించుకొని బయట పడగలిగారు.


Also Read: Aarogyasri Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ట్రీట్‌మెంట్


 
మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌ రెడ్డి, మోమిన్‌ పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌ పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, ఓ బాలుడు, మరో బంధువు రాఘవేందర్‌ రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్‌ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని వారు ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌ రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్‌ తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.


కొత్తపల్లి వాగులో సామల వెంకటయ్య శవం లభ్యం
చేవెళ్ల మండలం కౌకుంట్లలో శుభకార్యంలో పాల్గొనేందుకు మోమిన్‌ పేట్‌ మండలం ఎన్కెతల గ్రామానికి చెందిన సామల వెంకటయ్య(70), సాయి, ఎస్‌.శ్రీనివాస్‌ మధ్యాహ్నం వచ్చారు. వ్యక్తిగత పనుల కోసం కౌకుంట్లకు చెందిన బంధువులైన రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌తో కలసి కారులో ఎన్కెపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా డ్రైవర్‌ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. కారు కొట్టుకుపోగా.. సాయి, రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌, ఎస్‌.శ్రీనివాస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. దివ్యాంగుడైన వెంకటయ్య కారులోంచి బయటకు రాలేకపోయారు.


మంత్రి సబిత ఆరా..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. భారీ వర్షాలతో జరిగిన ఘటనలపై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆరా తీశారు. వికారాబాద్‌ కలెక్టర్‌, ఎస్పీతో సబితా ఇంద్రా రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీని ఆదేశించారు. వరద ఉధృతిలో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు మంత్రి సబిత ప్రజలకు సూచించారు.


Also Read: Hyderabad Crime: అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సాయం చేసిన కూతురు


Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం!