Vijayawada News: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్లలో వసూలు చేసి మోసం చేసిన దారుణ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సాల్ట్ అనే పథకాన్ని ప్రవేశ పెడుతుందని, దీనిపై అంగన్ వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లను నియమిస్తున్నానంటూ బురిడీ కొట్టించి వందలాది మంది నిరుద్యోగుల నుంచి కోట్లు కొట్టేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇద్దరు బాధితులు విజయవాడలోని సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ జిల్లా సూర్యారావు పేటలోని వేమూరి వారి వీధిలో ఆల్ఫాబెట్ వెంచర్ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థ వెలిసింది. ఎడ్యుకేషనల్ బుక్స్ పబ్లికేషన్, డిజిటల్ అండ్ బేస్డ్ లెర్నింగ్, పేపర్ అండ్ పేపర్ ప్రొడక్షన్ ప్రింటింగ్ అండ్ రీ ప్రొడక్షన్, మోషన్ పిక్టర్ ప్రొడక్షన్, రేడింయో అండ్ టెలివిజన్, స్టాఫింగ్ రిక్రూక్ మెంట్ ట్రైనింగ్, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ, స్మార్ట్ లైటిగ్ సిస్టమ్, సీసీఎంఎస్-ఐఓటీ-కంప్యూటర్స్ అండ్ రిలేటెడ్ సేవల పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. 


20 రోజుల శిక్షణ తర్వాత 40 వేల జీతం..


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సర్వీసులు ఏజెన్సీలకు అప్పగిస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మించారు. సంస్థ నెలకొల్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే "సాల్ట్" పథకానికి ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లను నియమిస్తున్నామని మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. దీంతో విస్సన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసి మానేసిన చిన్నం మృత్యుంజయ అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులను ఆకర్షించాడు. అంగన్ వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలకు సాల్ట్ పథకంపై శిక్షణనిచ్చే కాంట్రాక్టును ఆల్ఫాబెట్ వెంచర్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగిచిందనీ, ఇందుకుగాను ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లను ఆ సంస్థ నియమిస్తుందని, 20 రోజుల శిక్షణ తర్వాత నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని అతను అందరినీ నమ్మించాడు. 


డబ్బులు చెల్లించి శిక్షణ తీసుకున్నాక సంస్థ ఎత్తేసిన నిర్వాహకులు..


ఒక్కో ఉద్యోగం కోసం నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా విజయవాడలోని ఆల్పాబెట్ సంస్థ ప్రతినిధులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చిన్నం మృత్యుంజయ ద్వారానే తమ నుంచి 8.20 లక్షలు వసూలు చేసినట్లు ఇద్దరు బాధితులు చెబుతున్నారు. వీరిద్దరూ పీహెచ్డీ చేసి విస్సన్నపేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పని చేస్తున్నారు. తాము గతేడాది సెప్టెంబర్ లో డబ్బులు చెల్లించి 20 రోజులు శిక్షణ తీసుకున్నామని, ఆ తర్వాత సంస్థ నిర్వాహకులు జీతం ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే బోగస్ సంస్థలు వెలిశాయమని ఏలూరులో ఆదిత్య మ్యాన్ పవర్ సొల్యూషన్స్, కాకినాడలో మ్యాట్రిక్స్ మాన్ పవర్ సొల్యూషన్, విశాఖపట్నంలో మరో పేరుతో సంస్థలను నెలకొల్పినట్లు శిక్షణ కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పజెప్పలేదని స్పష్టం చేశారు.