US France United Front:


ప్రత్యేక ఫ్రంట్..


అమెరికా, ఫ్రాన్స్ సంయుక్తంగా ఓ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని పుతిన్‌తో మాట్లాడి ఒప్పించేందుకు ఈ ఫ్రంట్‌ చొరవ చూపనుంది. యుద్ధాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, కీలక ప్రాంతాల నుంచి రష్యా బలగాలు వెనక్కి రావాలని పుతిన్‌ను కోరనున్నాయి ఈ ఇరు దేశాలు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ ఇప్పటికే పుతిన్‌పై చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను వేధించి చంపుతున్నారని మండి పడ్డారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం పుతిన్‌తో చర్చలకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ఈ రెండు దేశాలు చొరవ చూపడానికి కారణం...రష్యా, ఉక్రెయిన్ నుంచి అత్యవసరాలు నిలిచి పోయాయి. క్రూడ్ ఆయిల్ సరఫరా కూడా బాగా తగ్గిపోయింది. బ్యారెల్ ధర 100డాలర్లకు చేరుకుంది. ఇక ఐరోపా దేశాలకు గ్యాస్ సప్లై కూడా అంతంతమాత్రంగానే ఉంది. అసలే శీతాకాలం. ఇప్పుడు గ్యాస్ అందకపోతే...ఐరోపా అంతా చలితో వణికిపోవాల్సిందే. అందుకే..బైడెన్, మేక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మేక్రాన్ పలు విషయాలు వెల్లడించారు. "రష్యా ఆగడాలను అడ్డుకునేందుకు మేమెప్పుడూ ఒక్కటిగానే ఉంటాం. ఉక్రెయిన్ ప్రజలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు పుతిన్‌ను కలిసే ఆలోచన తనకు లేదని...అయితే పుతిన్ యుద్ధాన్ని విరమించుకునే ఉద్దేశం ఉందంటేనే తప్పకుండా కలిసి మాట్లాడతానని
బైడెన్ వెల్లడించారు. ఇటీవలే ఇండోనేషియాలోని బాలీలో G20 సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పుతిన్‌, బైడెన్ హాజరయ్యారు. కానీ...ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. "పుతిన్‌తో కలిసి కూర్చోడం బానే అనిపించినా..యుద్ధం విషయంలో ఆయన మనసులో ఏముందో అనిపించింది" అని అన్నారు బైడెన్. ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలిచి, ప్రపంచ దేశాల స్థిరత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అమెరికాకు ఉందని మేక్రాన్ అభిప్రాయపడ్డారు. 


రష్యాకు ఐరోపా పార్లమెంట్ షాక్..


ఐరోపా పార్లమెంట్..రష్యాకు షాక్ ఇచ్చింది. ఎంత చెప్పినా వినకుండా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తుండటాన్నీ తీవ్రంగా పరిణగించిన యురోపియన్ పార్లమెంట్ (European Parliament) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాను "ఉగ్రవాదులకు సహకరించే"దేశంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచే ఈ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపించాయి ఐరోపా దేశాలు. దాదాపు 9 నెలల తరవాత ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చింది. ఇక ఇప్పటి నుంచి రష్యా వైఖరి ఎలా ఉండనుందనేదే ఆసక్తి రేపుతున్న విషయం. ఐరోపా పార్లమెంట్ చెబుతున్నదొక్కటే. "ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు, అక్కడి మౌలిక వసతులను నాశనం చేస్తున్న తీరు అంతర్జాతీయ, మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది" అని తేల్చి చెబుతోంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యా ఉగ్రవాద దేశం అంటూ మండి పడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు చాలా నెలలుగా ఈ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ వచ్చారు. ఉక్రెయిన్‌లో కీలకమైన పవర్ నెట్‌వర్క్‌నీ రష్యా దారుణంగా దెబ్బ తీసింది. ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనే అని ఉక్రెయిన్ ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. 


Also Read: Badruddin Ajmal: హిందూ వివాహాలపై నోరు జారిన ఎంపీ, నా ఉద్దేశం అది కాదంటూ క్షమాపణలు