Videos of Telugu youth who blackmailed a grocery store owner in America: అమెరికా దాకా వెళ్లాలంటే ఎంతో కష్టపడాలి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి . అక్కడ చదువు అయిపోయాక ఉద్యోగం తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్లేవారందరికీ అదే టార్గెట్ ఉంటుంది. అందుకే ఎన్నారైల నుంచి చాలా ఇన్‌స్పరింగ్ స్టోరీస్ వస్తాయి. కానీ అక్కడకు వెళ్లేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో కానీ అక్కడికి వెళ్లాక అసలు పనులు మానేసి చిల్లర పనులు చేస్తున్నారు. చివరికి చిల్లర దొంగాల్లో దుకాణాల్లో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి దొరికిపోతున్నారు. తాజాగా ఉప్పాల రోహిత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి చేసిన బ్లాక్ మెయిలింగ్ వాళ్లను ఒక్కసారిగా ఫేమస్ చేసేసింది.
డాలస్‌లో ఓ గ్రోసరీస్ స్టోర్ కు వెళ్లిన ఉప్పాల రోహిత్ అతని స్నేహితులు తూకాల్లో లోపాలు ఉన్నాయని వీడియో తీశారు. తర్వాత గ్రోసరీ స్టోర్ యజమానిని బెదిరించారు. లక్ష డాలర్లు ఇవ్వకపోతే అధికారులకు మీడియాకు పంపుతానని హెచ్చరించారు. ఆ ఓనర్లు కూడా తెలుగోళ్లే. మీకే ఇంత తెలివి తేటలుంటే నాకెంత ఉండాలని ఆయన వాళ్లని పట్టేసుకుని ఓ హోటల్లో కూర్చోబెట్టాడు. వాళ్లు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నట్లుగా నటించారు. చాలా సేపు ఈ డ్రామా జరిగింది. ఈ లోపు పోలీసులు వచ్చి కేసులు పెట్టారు.
ఈ యువకుల వ్యవహారం వైరల్ అయిపోయింది. తెలుగు వాళ్లు.. తెలుగు వాళ్లనే బ్లాక్ మెయిల్ చేయడం అదీ కూడా ఇంత సిల్లీగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలు అన్నీ ఒక్క సారిగా వైరల్ అయిపోయాయి. దీంతో వాళ్లెవరో ఆరా తీయడం ప్రారంభించారు. ఉప్పాల రోహిత్ సోష్ల మీడియా అకౌంట్ల నుంచి కొన్ని ఫోటోలు డౌన్ లోడ్ చేసి ఫలానా పార్టీకి చెందిన వారు అని ప్రచారం చేస్తున్నారు.
కేటీఆర్‌తో దిగిన ఓ ఫోటోను చూపించి బీఆర్ఎస్ కార్యకర్త అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు.
అయితే సీఎం రేవంత్, కోమటిరెడ్డి అమెరికా వెళ్లినప్పుడు వారినీ కలిసీ ఓ ఫోటో దిగాడు ఉప్పాల రోహిత్.
అమెరికా వెళ్లి కష్టపడి డాలర్లు సంపాదించుకోకుండా ఇలా సిల్లీ బ్లాక్ మెయిల్ క్రైమ్స్ చేసి.. పరువు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో ఆశలతో వారిని అమెరికాకు పంపిన వారి తల్లిదండ్రులు ఇక్కడ తల దించుకుంటున్నారు.