Video Recording In Girls Hostel Bathroom In Mahabubnagar: తెలంగాణలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవలే సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ వద్ద వీడియోల రికార్డింగ్ కలకలం రేపింది. హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డింగ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వాష్ రూం వద్ద మొబైల్‌లో కెమెరా ఆన్‌లో ఉంచి రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాక్‌లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి సదరు విద్యార్థి ఇలా చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలా జరిగిందని చెబుతున్నారు. తొలిసారి ఇలా జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, రాష్ట్రంలో వరుస ఘటనలతో హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఆకతాయిల్లో మార్పు రావడం లేదు. తమకు రక్షణ కల్పించాలని.. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.
సీఎంఆర్ కాలేజీ ఘటన..
కాగా, ఇటీవలే హైదరాబాద్ శివారు మేడ్చల్ వద్ద సీఎంఆర్ఐటీ గర్ల్స్ హాస్టల్ వద్ద కూడా వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ఆవరణలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరి వేలిముద్రలు సేకరించి.. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అటు, ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా ఘటనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.