UP Encounter List:


మాఫియాను మట్టి కరిపిస్తున్న యోగి..


"ఈ మాఫియాను మట్టి కరిపిస్తా". ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మాఫియా డాన్‌లకు ఈ వార్నింగ్ ఇచ్చారు. అలా వార్నింగ్ ఇచ్చిన 50 రోజుల్లోనే మూడు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఉమేష్ పాల్‌ హత్య జరిగింది. ఆ తరవాత రెండ్రోజులకే ఈ హత్యతో సంబంధం ఉన్న అర్బాజ్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న అసద్‌, గులాంను కూడా కాల్చి పారేశారు. మాఫియాపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తోంది యోగి సర్కార్. బెదిరింపులు, హత్యలు లాంటివి చేస్తే కాల్చి పారేస్తాం అని గన్‌తోనే సమాధానమిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ దాదాపు 183 మందిని ఎన్‌కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. 2020 నుంచి మాఫియాపై జీరో టాలరెన్స్‌ విధానం అమలు చేస్తోంది యోగీ ప్రభుత్వం. 


వరుస ఎన్‌కౌంటర్‌లు 


1. 2020లో జులై 10వ తేదీన గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా దూబే తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో దూబే మృతి చెందాడు. 


2.2020లోనే జులై 25వ తేదీన గ్యాంగ్‌స్టర్‌ టింకు కపాలాను యూపీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ జాయింట్‌ ఆపరేషన్ నిర్వహించి ఎన్‌కౌంటర్ చేశారు. 


3.2021లో అక్టోబర్ 18న బంగ్లాదేశ్ గ్యాంగ్‌స్టర్ హమ్‌జాను యూపీ పోలీసులు లఖ్‌నవూలో ఎన్‌కౌంటర్ చేశారు. 


4. సిద్ధ్‌పూర పోలీస్‌ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌ని హత్య చేయడంతో పాటు ఓ పోలీస్‌ను గాయపరిచాడు గ్యాంగ్‌స్టర్ మోతి సింగ్. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 2021 ఫిబ్రవరి 21న యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇదే ఏడాది మార్చి 21న ఓ క్రిమినల్‌ని వారణాసిలో కాల్చి పారేశారు. 


5.2022 సెప్టెంబర్ 30న గ్యాంగ్‌స్టర్ వినోద్ కుమార్‌ సింగ్‌ని కూడా ఇలాగే ఎన్‌కౌంటర్ చేశారు. ఇక లేటెస్ట్‌గా అసద్‌ అహ్మద్, గులాంను ఎన్‌కౌంటర్ చేశారు. 


2017 నుంచి..


పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌ల ఎన్‌కౌంటర్‌లు పెరిగాయి. ఈ ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్‌ ఆట కట్టించారు. 10,713 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో చనిపోయిన వాళ్లంతా బడా క్రిమినల్సే. 13 రోజులకో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. 23,069 మంది అరెస్ట్ అయ్యారు. 2017 మార్చి 20 నుంచి 2023 మార్చి 6 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో 15 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017లో 28 మంది, 2018లో 41 మంది, 2019లో 34 మంది, 2020లో 26 మంది, 2021లో 26 మంది క్రిమినల్స్ పోలీసుల చేతుల్లో ప్రాణాలొదిలారు. ఇకపైనా ఇదే దూకుడుతో ఉండాలని పోలీసులకు చెప్పారు యోగి ఆదిత్యనాథ్. ఆ మధ్య ఇండియా టుడే సర్వేలో దేశంలోనే ది బెస్ట్ సీఎంగా రికార్డుకెక్కారు యోగి ఆదిత్యనాథ్. పని తీరులో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న ముఖ్యమంత్రిగానూ నిలిచారు. ఇప్పుడు యూపీలో క్రైమ్ రేట్ తగ్గిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. 


Also Read: Amazon LayOffs: కఠిన నిర్ణయం అని తెలుసు, కానీ తప్పడం లేదు - లేఆఫ్‌లపై అమెజాన్ సీఈవో కామెంట్స్