UP Crime News:
ఆత్మహత్య..
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలో జరిగిందీ ఘటన. భార్య రాలేదని అసహనానికి గురైన వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి పేరు ప్రమోద్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. గుగా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం జరిపించారు. ప్రమోద్ భార్య ప్రీతి రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంకా ఇంటికి రాలేదని ప్రమోద్ భార్యకు కాల్ చేశాడు. ఆ సమయంలో ప్రీతి తల్లి ఫోన్‌లో గొడవ పడింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తట్టుకోలేక రాత్రి పూట ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమోద్. ఉదయం ఎంత సేపటికీ తలుపు తీయకపోవడం వల్ల అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు కుటుంబ సభ్యులు. గదిలో వేలాడుతూ కనిపించడం చూసి షాక్ అయ్యారు. కర్వా చౌత్ రోజున భార్య తన పక్కనే లేదన్న ఆవేదనతో ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గతంలోనూ ఈ తరహా బలవన్మరణాలు..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏరియాలో ఈ ఏడాది జులైలో జరిగిన సూసైడ్ మరీ విచిత్రంగా ఉంది. భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ గౌరీ శంకర్ నగర్‌లో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో ఉండే సంగీత, సంజీవ్ మధ్య నాలుగు రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త కోపంతో ఉన్నాడు. ఆమె వండి పెట్టింది తినడం మానేశాడు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. భర్త అలా నాలుగు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తనతో మాట్లాడకుండా ఉండటంతో భార్య సంగీత భరించలేకపోయింది. ఎంత బతిమాలినా దారికిరావడం లేదని మానసికంగా తీవ్ర కలత చెందింది. అంతే ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకుంది. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం ఏంటని బోరున విలపిస్తున్నారు.
Also Read: మూడు రోజుల క్రితమే పెళ్లి, అంతలోనే దారుణం - తమిళనాడులో పరువు హత్య