TSCAB Manager Arrested In Money Scam: అధిక వడ్డీ ఆశ చూపి 532 మంది నుంచి రూ.200 కోట్లు డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ నిందితులను హైదరాబాద్ (Hyderabad) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (TSCAB) జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల సహా ఆమె భర్త మేకా నేతాజీ, కుమారుడు శ్రీహర్షను అరెస్ట్ చేశారు. అబిడ్స్ లోని బ్యాంక్ జీఎంగా విధున్న నిర్వహిస్తోన్న వాణి.. ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు 532 మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. ఏడాదికి 24 శాతం వడ్డీ ఇస్తామని చెప్పడంతో చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. వాణి భర్త, కుమారుడు డిపాజిట్లు సేకరించారు. బాధితుల్లో 147 మంది బ్యాంక్ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.26 కోట్లు సేకరించారు. మొత్తంగా 532 మంది నుంచి రూ.200 కోట్లు సేకరించి పరారయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రియాంక ఎంటర్ ప్రైజెస్, చిట్ ఫండ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కామ్ జరిగినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


అధిక వడ్డీ ఇస్తామనే మోసం


ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్ తిలక్ రోడ్ లోని శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర వ్యాపారాలు చేసిన ఆయన.. వీటి నిర్వహణ కోసం సదరు సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీ ఆశ చూపడంతో చాలా మంది ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అలాగే, ప్రియాంక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు వంటి వాటిని కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్ లకు విక్రయించడం మొదలుపెట్టారు. TSCABలో జనరల్ మేనేజర్ గా ఉన్న నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణి అందులో పని చేసే ఉద్యోగులను తన భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు.


తమ సంస్థలో పెట్టుబడులు పెట్టే వారికి నేతాజీ, శ్రీహర్షలు ప్రత్యేకంగా ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో రశీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకాలు చేసి ఇచ్చారు. అయితే, గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా ఐపీ పిటిషన్ దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారించిన పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు. కాగా, ప్రభుత్వం వాణిబాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.


Also Read: ACB Raids: ఏసీబీ వలలో అవి'నీటి' అధికారులు - అర్ధరాత్రి హైడ్రామా, 4 గంటలు శ్రమిస్తే తప్ప!