ACB Officers Caught Irrigation Officers In Rangareddy: ఇటీవల ఏసీబీ విస్తృత సోదాలతో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలవుతోంది. తాజాగా, నీటి పారుదల శాఖలో నలుగురు అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఎస్ఈ కార్యాలయంలో ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి అధికారులు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి అక్కడికక్కడే పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన మరో కీలక అధికారి ఒకరు త్రుటిలో తప్పించుకోగా అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రాత్రి వరకూ సోదాలు కొనసాగించారు. దాదాపు 4 గంటలు శ్రమించి కీలక అధికారిని పట్టుకుని.. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఇదీ జరిగింది
అధికారులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయం అధికారుల్ని ఓ వ్యక్తి.. దస్త్రం ఆమోదం కోసం ఆశ్రయించారు. అయితే, అక్కడే ఈఈగా పని చేస్తోన్న భన్సీలాల్, ఏఈలు నిఖేశ్, కార్తీక్ ముగ్గురూ రూ.2.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందుకు అంగీకరించిన సదరు వ్యక్తి తొలుత రూ.1.50 లక్షలు అందించారు. ఇంకో రూ.లక్షను గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలోనే తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే, దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో.. నీటి పారుదల శాఖ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఇదే సమయంలో లంచం డిమాండ్ చేసిన కీలక అధికారి అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సుమారు 4 గంటలు శ్రమించి సదరు అధికారిని సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో సోదాలు ముగిసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది బృందం సోదాల్లో పాల్గొంది. అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.