Tollywood Drugs CAse ED : టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వదిలి పెట్టట్లేదు. మరో సారి సాక్ష్యాల కోసం కోర్టును ఆశ్రయించింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 2017 డ్రగ్స్ కేసుకు సంబంధించి సాక్ష్యాలను ఎక్సైజ్ శాఖ పూర్తిగా తమకు ఇవ్వలేదని తెలిపింది. ఆ కేసులో 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారని .. ఎక్సైజ్ కోర్టులో సబ్ మిట్ చేశారని ఈడీ పిటిషన్‌లో తెలిపింది. సాక్ష్యాల కోసం గతంలో ఈడీ హైకోర్టుకు కూడా వెళ్లింది. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడంతో చివరికి ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. చివరికి ఎక్సైజ్ అధికారులు సాక్ష్యాలు ఇచ్చారు. అయితే వాటిలోనూ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌లు లేవని ఈడీ అధికారులు చెబుతున్నారు. నిందితుల సెల్ ఫోన్లు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో ప్రధానంగా కోరింది.
Also Read: kharif Crops: రైతులకు కేంద్రం శుభవార్త- 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులే కీలకంగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో గతంలో ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో.. కీలకమైన వాంగ్మూలాలు డిజిటల్ ఆధారాలు ఉన్నాయని అనుకున్నారు. వాటి ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయనుకున్నారు. కానీ ఇవ్వలేదని ఈడీ తాజా పిటిషన్ ద్వారా వెల్లడయింి. ఇప్పటికే ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అప్పుడు వారికిఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో ఎవరూ బయటపడలేదు. దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు.
నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదా అనేది కాదు… డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనే. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా తేలిపోతుంది. ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు చెల్లించినట్లుగా బయటపడితే… ఇక చిక్కులు తప్పనట్లే. ఆ ఒక్కలింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే అవకాశం ఉంది. ఎలా చూసినా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సాక్ష్యాలు మాత్రం ఇంకా ఈడీ చేతికి చిక్కడం లేదు.