Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఊరేగింపులో 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. బాలికకు మత్తు మందు ఇచ్చి నిర్మానుష ప్రదేశంలోకి ఎత్తుకెళ్లిన యువకులు, బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 


అసలేం జరిగింది? 


కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో వాడవాడల వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి నామస్మరణలతో మారుమోగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపును వీక్షించేందుకు వచ్చిన బాలికపై కొందరు యువకులు కన్నేశారు. వైభవంగా సాగుతున్న వినాయక చవితి వేడుకల్లో అందరి కళ్లు కప్పి ఎలాగైనా బాలికను ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశారు. అనుకున్న విధంగానే పక్కా స్కెచ్ తో విగ్రహ ప్రతిష్ఠ యాత్ర చేస్తున్న సమయంలో బాలికకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా అదును చూసి బాలికను పక్కనే ఉన్న నిర్మానుష ప్రదేశంలోనికి తీసుకెళ్లిన యువకులు, బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  


తిరుపతిలో దారుణం 


తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో వినాయక ప్రతిష్ట ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు. ఆ ఊరేగింపును చూసేందుకు గ్రామ ప్రజలంతా ఇంటి నుంచి బయటకు వచ్చారు. అందరూ స్వామి వారి విగ్రహం ఎలా ఉంది అని చూసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇంతలోనే ఓ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. కొందరు యువకులు ఒంటరిగా ఇంటి బయట ఉన్న బాలికపై కన్ను వేశారు. అనుకున్నదే తడువుగా పక్కా ప్లాన్ అమలు చేశారు. ఈ ప్లాన్ లో‌ భాగంగా ఓ యువకుడు బాలిక వైపు వెళ్లి మత్తు ఉన్న ఇంజక్షన్ ఇచ్చాడు. చీమ కుట్టినట్లు ఉండటంతో ఆ బాలిక పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల్లో ఆ బాలిక మెల్లగా మత్తులోకి జారుకుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కామాంధులు విగ్రహ ప్రతిష్టకు కాసంత దూరంలోని నిర్మానుష ప్రదేశంలోకి బాలికను ఎత్తుకెళ్లారు. ఒకరి తరువాత మరొకరు బాలికపై లైంగిక దాడి చేశారు. అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోయారు యువకులు. 


పరారీలో ముగ్గురు యువకులు 


కొంత సేపటికి స్పృహలోకి వచ్చిన బాలిక నేరుగా ఇంటికి చేరుకుని, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా మొత్తం ముగ్గురు యువకులు బాలికపై లైంగికదాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక గ్రామంలో మరి కొందరు యువకులను సైతం పోలీసులు విచారించారు. అయితే నిందితులైన యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, వైద్య పరీక్షల నిర్వహించిన వైద్యులు బాలిక కొంత నీరసించి ఉందని వెల్లడించారు. బాలికను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే నిందుతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుల కోసం బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


Also Read : Tammineni Krishnaiah Murder Case: తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ట్విస్ట్, కోర్టులో లొంగిపోయిన నిందితులు


Also Read : Gas Cylinders Explosion: ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, లారీలో ఒక్కసారిగా పేలిన వందల సిలిండర్లు