Khammam News : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో నిందితులు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్యకేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య కోర్టుకు వచ్చారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడే ఈ తమ్మినేని కోటేశ్వర రావు. కాగా, ఆయనతోపాటు మరో నిందితుడు ఏ10 నాగయ్య కూడా ఉన్నారు. తాజాగా ఏ9 కోటేశ్వర రావు, ఏ10 నాగయ్య శుక్రవారం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కేసులో ప్రధాన నిందితులు మొత్తం పోలీసుల కస్టడీలో ఉండటంతో కేసు విచారణ వేగవంతం కానుంది. పోలీసులు కోర్టుకు (Tammineni Krishnaiah Murder Case) కేసు వివరాలు సమర్పించనున్నారు. నిందితులకు త్వరలోనే కోర్టు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.


ఆటోతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో దాడి.. 
ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో ఆగస్టు 15న బైక్‌పై వెళ్తోన్న తమ్మినేని కృష్ణయ్య  (Tammineni Krishnaiah) దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది. తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు.  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 


హత్య తరువాత కోటేశ్వరరావు ఇంటిపై దాడి 
తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు ఇంటిపై వారు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కృష్ణయ్య వరుసకు సోదరుడు అవుతాడు. కృష్ణయ్య సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెల్దారుపల్లిలో రాజకీయ విద్వేషాలే ఈ దారుణ హత్యకు కారణంగా తెలుస్తోంది. వీరభద్రం సొంత సోదరుడితో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.  ఈ హత్య అనంతరం కృష్ణయ్య వర్గీయులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తెల్దారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో పోలీసులను మోహరించారు.  


రాజకీయకక్షలే కారణమని ఆరోపణలు   
దారుణ హత్యకు గురైన కృష్ణయ్య  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడైన కృష్ణయ్య భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీటీసిగా గెలిచారు. వీరు టీఆర్ఎస్ సానుభూతి పరులుగా ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే దారుణ హత్య జరగడం ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.


Also Read: Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !