Tirupati Crime News :   అప్పు చెల్లించకపోతే నీ కూతుర్ని తీసుకెళ్తానని సినిమాలో వడ్డీ వ్యాపారులైన విలన్లు అనడం కామన్. కానీ ఇప్పుడు వడ్డీ వ్యాపారులు మరీ అంత అమాయకంగా లేరు. బాగా తెలివి మీరిపోయారు. అప్పులు తీర్చకపోతే పిల్లల్ని తీసుకెళ్తామని బెదిరింపులు చేస్తున్నారు.. తీసుకెళ్తున్నారు కూడా. కానీ పోలీసులకు దొరక్కకుండా కొత్త పద్దతిలో తీసుకెళ్తున్నారు. తిరుపతిలో వెలుగు చూసిన ఈ తరహా నేరమే వడ్డీ వ్యాపారుల తెలివికి ఉదాహరణ. 


అప్పు చెల్లించలేకపోతే కుమార్తెతో తాను చెప్పిన వ్యక్తికి పెళ్లి చేయాలన్న వడ్డీ వ్యాపారి


చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, ఆళ్లమడుగు గ్రామంలో  ఓ వ్యక్తి తన పదమూడేళ్ల కుమార్తెకు పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పసిపిల్ల అయిన అమ్మాయికి అప్పుడే పెళ్లేమిటని.. అసలు వరుడెవరని గ్రామస్తులు అడిగినా పట్టించుకోలేదు. వాళ్లను కసురుకున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కూడా వచ్చారు. అప్పటికే పెళ్లి కుమారుడు ఇతరులు కూడా వచ్చారు. దీంతో పోలీసులు వాళ్లందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అసలు ఇంత హఠాత్తగా పెళ్లేమిటి .. ఎందుకీ హడావుడి అంటే అసలు విషయం చెప్పారు. 


అప్పు తీర్చే దారి లేక సరేనన్న తండ్రి 


ఆ అమ్మాయి తండ్రి ఓ వ్యక్తి వద్ద అప్పులు చేశాడు. ఆ వ్యక్తి అప్పులు తీర్చాలని ఒత్తిడి చేశాడు. కానీ ఈ వ్యక్తి దగ్గర డబ్బుల్లేవ్. ఏం చేసినా లేని డబ్బులు తెచ్చివ్వలేడని తెలుసుకున్న వడ్డీ వ్వాపారికి ఆ వ్యక్తి కుమార్తెపై కన్ను పడింది. పదమూడేళ్లే ఉన్నప్పటికీ.. తాను ఓ సంబంధం తెస్తానని అతనికి ఇచ్చి చేస్తే.. ఆ అప్పు అతని వద్ద వసూలు చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో అప్పు తీరిపోతుంది కదా అని తండ్రి కూడా వెంటనే అంగకరించాడు. వడ్డీ వ్యాపారి తెచ్చిన పెళ్లి కొడుక్కి ముఫ్ఫై ఏళ్లకుపైగా ఉంటాయి. 


చివరి క్షణంలో సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు


పోలీసులు అందర్నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రులపై, మైనర్ బాలికను వివాహం చేసుకుందుకు ముందుకు వచ్చున వరుడిపై, బాలిక తండ్రిని రెచ్చగొట్టిన వడ్డీ వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.. చివరికి పోలీసుల ఎంట్రీతో బాల్య వివాహం రద్దు అయ్యింది.పోలీసుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ పూర్తి వివరాలు సేకరించి  బాలిక సంరక్షణను చూసుకునే ఏర్పాట్లు చేశారు.