Tractor Accident In Bapatla District: ఏపీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సోదరులు మృతి చెందగా.. బాపట్ల జిల్లాలో (Bapatla District) ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెం (Karlapalem) మండలం యాజలిలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది ఉన్నారు. నగరం మండలం గట్టువారిపాలెం గ్రామానికి చెందిన వీరంతా.. కొండపాటూరు పోలేరమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకునేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.


ఆర్టీసీ బస్సును తప్పించబోయి


ఈ క్రమంలో యాజలి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


కాకినాడలోనూ..


అటు, కాకినాడ (Kakinada) జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లి (Gandepalli) మండలం మురారి వద్ద రోడ్డుపై బైక్ అదుపు తప్పి పడిపోగా కింద పడిన వారిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా.. వారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ (40)కు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ముగ్గురు కుమారులు. వీరి కుటుంబం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లి బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున గండేపల్లి మండలం మురారి శివారు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Chevireddy Mohith Reddy: పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు, బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అరెస్ట్