Chevireddy Mohith Reddy arrested in bangalore | తిరుపతి: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అభియోగాలున్నాయి. పులివర్తి నానిపై దాడి సమయంలో ఆయన గన్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గన్ మెన్ గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరపడం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూముని పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి వర్గీయులు ప్లాన్ ప్రకారం దాడి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. కారు కెమెరాల్లో అందుకు సంబంధించిన విజువల్స్ నమోదయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కలకలం రేపడం తెలిపిందే.


టీడీపీ నేత పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో చంద్రగిరి పోలీసులు ఆ సమయంలోనే కొంత మందిని అరెస్టు చేశారు. కానీ ఈ దాడికి అసలు సూత్రధారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాల్ రికార్డుతో పాటు ఆయన దాడి సమయంలో ఎస్వీయూ దగ్గరే ఉన్నారని ఆధారాలు దొరికినట్లు సమాచారం. దీంతో ఆయనపై చంద్రగిరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మోహిత్ రెడ్డి దాఖలు చేశారు. కోర్టు మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అప్పట్నుంచి మోహిరెడ్డి అదృశ్యమయ్యాడు. తన కుమారుడ్ని అరెస్టు చేస్తారని తెలిసిన తర్వాత చెవిరెడ్డి .. అసలు పులివర్తి నానికి గాయాలు కాలేదని వింత వాదనకు తెరతీశారు.  
 ఈ క్రమంలో మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. బెంగళూరులో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి మోహిత్ రెడ్డిని చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి తరలించి, అనంతరం తిరుపతి కోర్టులో మోహిత్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్నారు.