Visakhapatnam Crime News: విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో గురువారం రాత్రి రెండు కుటుంబాలు మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కుటుంబాల మధ్య చోటుచోటుకున్న గొడవలో ఇరు కుటుంబాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాలు, మీడియా వేదికగా బయటకు రావడంతో పెద్ద రచ్చ జరిగింది. అధికార పార్టీకి ఓటేయకపోవడంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.


ఈ గొడవపై విచారణ చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం మాట్లాడిన పోలీసులు ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో రాజకీయ ప్రమేయం లేదని తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ మేక సత్తిబాబు వివరించారు. కంచరపాలెం పరిధిలో మహిళలపై జరిగిన దాడికి వ్యక్తిగత గొడవలే కారణమని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు.


ఈ దాడి ఘటనను ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. స్థానిక బర్మా క్యాంప్‌ నూకాలమ్మ ఆలయ సమీపంలో సుంకరి ఆనందరావు, భార్య ధనలక్ష్మి, కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠతో కలిసి ఉంటోందన్నారు. ఆమె ఇంటికి సమీపంలో లోకేష్‌ తన కుటుంబంతో ఉంటున్నారని. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి వివాదానికి ముందు నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు లోకేష్‌ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారని వివరించారు. ఇంటికి సమీపంలో ఉన్న లోకేష్‌కు విషయం తెలిసి అక్కడకు చేరుకున్నాడని, తన ఇంటిపై గొడవకు వచ్చిన నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులను తిట్టాడన్నారు. దీంతో నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి రాగా వారిపై లోకేష్‌ కర్నతో దాడి చేయగా, నూకరత్నం, ఆమె కుమార్తె, మరో యువకునికి గాయాలయ్యాయన్నారు. గాయాలైన వారంతా కేజీహెచ్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. దాడికి పాల్పడిన లోకేష్‌, మరో నలుగురిపై కేసులు నమోదు చేశారన్నారు. లోకేష్‌ను రిమాండ్‌కు తరలించారని ఆయన వివరించారు. 


వైసీపీకి ఓటేయకపోవడం వల్లే దాడి


అధికార వైసీపీకి ఓటేయకపోవడం వల్లే దాడికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పలు చానెల్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రసారం చేశారు. వైసీపీకి ఓటేయలేదన్న ఉద్ధేశంతోనే వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న కొందరు ఈ దాడికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం హోరెత్తింది. అయితే, ఈ ప్రచారాన్నిపోలీసులు ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య గొడవను రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం చేయవద్దని పోలీసులు కోరడం గమనార్హం. అయితే, బాధితులుగా ఉన్న వారి కథనం మరోలా ఉండడం గమనార్హం.