Dimple Hayathi: సినీనటి డింపుల్ హయతి ఇంట్లోకి ఓ యువతీ, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎస్కేఆర్ ఎన్ క్లేవ్ లో డింపుల్ హయతితో పాటు ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్ అక్కడే ఉంటున్నాడు. అయితే అదే అపార్ట్ మెంట్ లో నివసించే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో డింపుల్, డేవిడ్ లకు నాలుగు రోజుల నుంచి వివాదం జరుగుతోంది. ఈ కేసు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు యువతీ, యువకులు ఆమెకు తెలియకుండా ఇంట్లోకి చొరబడడంతో.. ఆమె తీవ్రంగా భయపడిపోయారు. 


అసలేం జరగిందంటే..?


గురువారం రోజు ఉదయం ఎవరికీ తెలియకుండా అపార్ట్ మెంట్ లోకి చొరబడ్డారు ఓ యువతీ, యువకుడు. అయితే సీ2లో ఉండే డింపుల్ నివాసంలోకి నేరుగా వెళ్లిపోయారు. పని మనిషి ఎవరంటూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఇంట్లోని కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లిపోయారు. లిఫ్టు లోపలికి వారితో పాటు వెళ్లిన కుక్క తిరిగి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న డింపుల్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. యువతీ, యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. నేరుగా వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే వారిని పోలీసులు విచారించగా... రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని పేర్కొన్నారు. అయితే గత నాలుగు రోజులుగా జరుగుతున్న గొడవ నేపథ్యంలోనే ఆమెను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని పోలీసులు డింపుల్ కు తెలపగా... వారిని విడిచి పెట్టమని చెప్పారట. యువతీయువకులు కొప్పిశెట్టి సాయిబాబా, అతని బంధువు శృతిగా గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి పెట్టినట్లు సమాచారం.    


మరోవైపు డింపుల్, డీసీపీ మధ్య వ్యవహారం


యువ కథానాయిక, తెలుగమ్మాయి డింపుల్ హయతి (Dimple Hayathi) వర్సెస్ ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ రాహుల్ హెగ్డే (IPS Rahul Hegde BK) వ్యవహారం గురించి పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఎవరి వాదనలను వాళ్ళు బలంగా వినిపిస్తూ ఉన్నారు. పార్కింగ్ చేసిన ప్రభుత్వ వాహనానికి డింపుల్ డ్యామేజ్ చేశారని, ట్రాఫిక్ కోన్స్‌ను కాలితో ఉద్దేశ పూర్వకంగా తన్నారని రాహుల్ హెగ్డే ఆరోపించారు. తాను ప్రభుత్వ అధికారిని అని, పైగా ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న కారణంగా అత్యవసర విధుల నిమిత్తం బయటకు వెళ్ళాల్సి ఉంటుందని, ఇవన్నీ డింపుల్ హయతికి చాలా స్పష్టంగా వివరించినప్పటికీ తమ వాహనానికి ఆమె కారును అడ్డుగా పెడుతూ వస్తున్నారని ఆయన చెబుతున్నారు. 


డీసీపీ రాహుల్ హెగ్డే తమ హోదాను అడ్డు పెట్టుకుని డింపుల్ హయతిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. రోడ్స్ మీద ఉండాల్సిన ట్రాఫిక్ కోన్స్ ఓ అపార్ట్మెంట్ సెల్లార్ ఏరియాలోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణకు రోడ్స్ మీద ఉపయోగించే సిమెంట్ దిమ్మలు (ప్రీ కాస్ట్ డివైడర్లు) అపార్ట్మెంట్ లోపాలకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదంలో బల్దియా అధికారులు ఇరుక్కున్నారు. వాళ్ళు చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ విధులను పోలీస్ శాఖ నిర్వర్తిస్తోంది. ఆ బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ... రోడ్లు, వనరుల కల్పన మాత్రం బల్దియాదే. ట్రాఫిక్ సిగ్నల్స్ మొదలుకుని ట్రాఫిక్ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను ఏర్పాటు చేసేది జీహెచ్ఎంసీ అధికారులే. 


Also Read: డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు, అలా ఎలా వదిలేశారు సార్?