యువ కథానాయిక, తెలుగమ్మాయి డింపుల్ హయతి (Dimple Hayathi) వర్సెస్ ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ రాహుల్ హెగ్డే (IPS Rahul Hegde BK) వ్యవహారం గురించి పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఎవరి వాదనలను వాళ్ళు బలంగా వినిపిస్తూ ఉన్నారు. 


పార్కింగ్ చేసిన ప్రభుత్వ వాహనానికి డింపుల్ డ్యామేజ్ చేశారని, ట్రాఫిక్ కోన్స్‌ను కాలితో ఉద్దేశ పూర్వకంగా తన్నారని రాహుల్ హెగ్డే ఆరోపించారు. తాను ప్రభుత్వ అధికారిని అని, పైగా ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న కారణంగా అత్యవసర విధుల నిమిత్తం బయటకు వెళ్ళాల్సి ఉంటుందని, ఇవన్నీ డింపుల్ హయతికి చాలా స్పష్టంగా వివరించినప్పటికీ తమ వాహనానికి ఆమె కారును అడ్డుగా పెడుతూ వస్తున్నారని ఆయన చెబుతున్నారు. 


డీసీపీ రాహుల్ హెగ్డే తమ హోదాను అడ్డు పెట్టుకుని డింపుల్ హయతిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. రోడ్స్ మీద ఉండాల్సిన ట్రాఫిక్ కోన్స్ ఓ అపార్ట్మెంట్ సెల్లార్ ఏరియాలోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణకు రోడ్స్ మీద ఉపయోగించే సిమెంట్ దిమ్మలు (ప్రీ కాస్ట్ డివైడర్లు) అపార్ట్మెంట్ లోపాలకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదంలో బల్దియా అధికారులు ఇరుక్కున్నారు. వాళ్ళు చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది.


Also Read : 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ఫిక్స్ - ఆ దర్శకుడితోనే


జీహెచ్ఎంసీ పరిధిలోని టాఫిక్ నిర్వహణ, నియంత్రణ విధులను పోలీస్ శాఖ నిర్వర్తిస్తోంది. ఆ బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ... రోడ్లు, వనరుల కల్పన మాత్రం బల్దియాదే. ట్రాఫిక్ సిగ్నల్స్ మొదలుకుని ట్రాఫిక్ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను ఏర్పాటు చేసేది జీహెచ్ఎంసీ అధికారులే. 


సెల్లార్‌లోకి కోన్స్ ఎవరు తీసుకు వెళ్లారు?
డింపుల్ హయతి న్యాయవాది సంధించిన ప్రశ్నల్లో రోడ్స్ మీద ఉండాల్సిన కోన్స్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి ఎవరు తీసుకు వెళ్లారు? అని! ఆ విషయం మీద బల్దియా అధికారులను ప్రశ్నిస్తే... తమకు తెలియదని జవాబు ఇస్తున్నారు. ఆ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను సెల్లార్‌లోకి తరలించడం నిబంధలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఎవరు తరలించారో తెలుసుకుని చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానాలు దాటవేస్తున్నారు. దాంతో డింపుల్ హయతి ట్వీట్స్ చేసినట్లు అధికార దుర్వినియోగం జరిగిందని ప్రజల్లో కొందరు భావిస్తున్నారు.


తప్పుల్ని దాచలేరు! - డింపుల్ ట్వీట్స్!
'అధికారాన్ని ఉపయోగించడం ద్వారా తప్పుల్ని ఆపలేరు' అని మంగళవారం ఉదయం డింపుల్ హయతి ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తప్పుల్ని దాచలేరని ఆమె మరో ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ పేర్కొన్నారు. అభిమానుల ఆందోళనను అర్థం చేసుకోగలనని, ఇప్పటి వరకు తానూ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, లీగల్ టీం ద్వారా ఈ కేసును ఎదుర్కొంటానని ఆమె తెలిపారు.


తనపై తప్పుడు కేసు పెట్టారని డింపుల్ హయతి చెప్పినట్లు ఓ వాయిస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత పెద్ద అధికారిని తాను ఏం చేయగలనని ఆమె ప్రశ్నించినట్టు ఆ ఆడియోలో ఉంది. 


Also Read అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ సేల్స్ షురూ - రేటు ఎంతంటే?