తెలంగాణలో సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ధర్మ నాయక్‌ కారు వారం రోజుల క్రితం ప్రమాదానికి గురైంది. మెదక్‌ జిల్లా తెక్మల్‌ మండలంలోని వెంకటాపురంలో జరిగిన ఈప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.  మంటలు అంటుకొని అందులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయి చనిపోయారు. ప్రమాద విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. 


కారులో కాలిపోయిన డెడ్‌బాడిని ధర్మ నాయక్‌ ఫ్యామిలీకి చూపించారు. వాళ్లు అది ధర్మ నాయక్‌దేనని గుర్తుపట్టారు. అంత్యక్రియలు కూడా చేశారు. అంతా వచ్చి సానుభూతి తెలిపారు. ఇంతటితే ఇది ముగిసిన వ్యవహారంగా అంతా అనుకున్నారు. కానీ అక్కడే కథ స్టార్ట్ అయిందని చాలా మందికి తెలియలేదు. 


రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధారణంగానే దర్యాప్తు చేశారు. అయితే ప్రమాదం జరిగిన కారుకు కొద్ది దూరంలో ఓ పెట్రోల్ బాటిల్‌ కనిపించింది. దీంతో పోలీసులకు ప్రమాదంపై అనుమానం వచ్చింది. అంతే కేసులో మరింత లోతుగా వెళ్లి విచారిస్తే షాకింగ్‌ ట్విస్ట్ రివీల్ అయింది. 


తెలంగాణలో సెక్రటేరియట్ ఉద్యోగి 48 ఏళ్ల ధర్మ నాయక్‌ చనిపోలేదని బతికే ఉన్నాడన్న వాస్తవాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా ఇన్సురెన్స్ డబ్బు కోసం ఆడుతున్న డ్రామాగా తేల్చారు. దీంతో పోలీసుల మైండ్‌ బ్లాంక్‌ అయింది. ధర్మ నాయక్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ అందరి ఫోన్లపై ఫోకస్ పెట్టిన పోలీసులకు మరిన్ని కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 


కుట్రను ప్రమాదంగా చిత్రీకరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ధర్మ నాయక్‌... తరచూ భార్యతో మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో చాలా కీలక విషయాలు చర్చించినట్టు కూడా గుర్తించారు. తన పేరుపై ఉన్న ఇన్సురెన్స్‌ డబ్బుల గుర్తించి ఎక్కువగా మాట్లాడుకున్నట్టు తెలుసుకున్నారు. 


ధర్మ నాయక్‌ పేరు మీద ఏడు కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ ఉంది. దాన్ని కొట్టేయడానికే ఇలా ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. చనిపోయినట్టు నాటకం ఆడిన ధర్మనాయక్‌... అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత భార్యతో మాట్లాడారు. ఇన్సురెన్స్‌ వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు. 


డెత్‌ సర్టిఫికేట్ ఉంటే తప్ప ఇన్సురెన్స్‌కు అప్లై చేసుకోలేమని భార్య చెప్పిన విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఫోన్ ట్రాప్ చేసిన పోలీసులకు అసలు గుట్టు తెలిసింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న ధర్మ నాయక్‌ కోసం వేట మొదలు పెట్టారు. ఆయన్ని పట్టుకుంటే కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. 


ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన డ్రైవర్‌ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. అసలు ప్రమాదంలో దొరికిన డెడ్‌బాడీ ఎవరిది అనే సస్పెన్స్‌ వీడాల్సి ఉంది. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే మాత్రం ధర్మనాయక్‌ను పట్టుకోవాలని పోలీసులు గాలిస్తున్నారు. ఈయన కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఆయన ఫోన్ చేసిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి వెతుకులాట సాగిస్తున్నారు. ఏ క్షణమైనా ధర్మ నాయక్‌ను పట్టుకుంటామని చెబుతున్నారు. 


Also Read: రాయదుర్గం పీఎస్‌లో అనుమాన్సపద మృతి- ఆత్మహత్యే నంటున్న ఎస్పీ ఫకీరప్ప


Also Read:  భార్యపై అనుమానంతో కక్ష పెంచుకున్న భర్త, ఎవరికి తెలియకుండా ఎలా హత్య చేశాడంటే ?