Anantapur News: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ కాగినల్లి ఫకీరప్ప స్పందించారు. రామాంజనేయులు అనే దొంగ అతను ధరించిన లుంగితోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆ దొంగలను లాకప్ లో ఉంచకుండా కంప్యూటర్ రూమ్ లో ఉంచి విధుల‌్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ గంగన్న, మధులతోపాటు హోంగార్డ్ రమేష్ ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలను అనుసరించి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం చేయిస్తున్నామని చెప్పారు. జ్యుడీషియల్ విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోని కోరుతామని ఫకీరప్ప చెప్పుకొచ్చారు. విచారణలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు బయటపడితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అసలేం జరిగిందంటే..?
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్నారని రామాంజనేయులు అలియాస్ అంజితోపాటు మరొకరిని రాయదుర్గంలోని పైతోట ప్రాంతవాసులు పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు లాకప్ లో ఉంచకుండా ఓ కంప్యూటర్ గదిలో ఉంచారు.
తెల్లారేసరికి కంప్యూటర్ గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ అంజి కనిపించాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్థానికులు అంజీ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మృతిపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అతడిని పోలీసులే చంపి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా లాకప్‌డెత్ అంటూ స్థానికంగా కూడా అనుమానాలు మొదలయ్యాయి.
వీటన్నంటిపై స్పందించిన జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఇది లాకప్ డెత్ కాదని తేల్చారు. ఆయన తన లుంగీతోనే ఉరివేసుకొని చనిపోయాడని వివరించారు. అరెస్టు చేసిన వ్యక్తిని లాకప్ లో కాకుండా కంప్యూటర్ గదిలో ఉంచడంపై పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. అతడి కట్టుకున్న లుంగీతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.