Telangana Man Died In Saudi Desert: ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి ఎడారిలో దారి తప్పిపోయాడు. జీపీఎస్ పని చేయక 4 రోజులుగా తిండి, నీరు లేక డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌కు (Karimnagar) చెందిన షహాభాజ్ ఖాన్ (27) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ ఆల్ హాసా ప్రాంతంలో ఓ టెలికం కంపెనీలో టవర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఐదు రోజుల క్రితం షహాబాజ్ ఖాన్, తన సహోద్యోగి సుడానీస్ పౌరుడితో కలిసి జీపీఎస్ సాయంతో కారులో బయలుదేరారు. అయితే, దారిలో జీపీఎస్ పని చేయక దారి తప్పి ప్రమాదకరమైన 'రబ్ అల్ ఖలీ' ఎడారి లోపలికి వెళ్లిపోయారు.


4 రోజులుగా తిండి లేక..


జీపీఎస్ సిగ్నల్ ఆగిపోయి, మొబైల్ ఛార్జింగ్‌తో సహా కారులో ఇంధనం కూడా అయిపోవడంతో ఇద్దరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడారిలోని వీరు చిక్కుకున్న 'రబ్ అల్ ఖలీ' ప్రాంతం అత్యంత నిర్జన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మనుషులు, ఒంటెలు ఏవీ ఉండవు. దిక్కుతోచని స్థితిలో ఎడారిలో జనావాసాలు వెతుక్కుంటూ వెళ్లిన షహాభాజ్ ఖాన్, మరో వ్యక్తి 4 రోజులుగా తిండి, నీరు లేక వేడి, డీహైడ్రేషన్‌తో అలమటించారు. తాము దారి తప్పామనే విషయాన్ని యాజమాన్యానికి చెప్దామన్నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయి ఏం చేయలేకపోయారు. ఎటు చూసినా ఎడారి మాత్రమే కనిపించడంతో ఇక చేసేది లేక అక్కడే నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో ఎండ వేడిమి, ఆకలితో ప్రాణాలు కోల్పోయారు.


యాజమాన్యం ఫిర్యాదుతో


అయితే, సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా పోయినట్లు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు గాలింపు చేపట్టారు. చివరకు ఎడారిలో కారు పక్కన ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వారి మరణవార్తను కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలపగా.. కన్నీరు మున్నీరుగా విలపించారు.


Also Read: N Convention : ఆధారాలతో సహా కోమటిరెడ్డి ఫిర్యాదు - క్షణం ఆలస్యం చేయని హైడ్రా - ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందంటే ?