Telangana High Court Key Orders On Eturunagaram Encounter: ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌కు (Eturunagaram Encounter) సంబంధించి పోలీసులకు తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) కీలక ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. ఆదివారం జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై సోమవారం విచారణ జరగ్గా.. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని న్యాయస్థానానికి వివరించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని.. కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టంకు తరలించారని అన్నారు. ఎన్‌హెచ్ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టుకు విన్నవించారు.


అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మావోల మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం మంగళవారం వరకూ మృతదేహాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలను బంధువులు, కుటుంబ సభ్యులకు చూపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


ఇదీ జరిగింది


ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావో కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. అలాగే, ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది.


ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని.. మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని లేఖలో పేర్కొంది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలుపరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో వెల్లడించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


Also Read: Road Accident: అడుగు దూరంలో నిలిచి అందనంత దూరానికి - చిన్నారి ఉసురు తీసిన లారీ, తెలంగాణలో తీవ్ర విషాద ఘటన