Tdp And Ysrcp Activists Severely Beaten In Ongole: ప్రకాశం (Prakasam) జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీన్ లోకి ఎంటర్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని (Ongole) సమతానగర్ లో బుధవారం రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకోగా.. కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అటు, ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రిమ్స్ లోనూ..
మరోవైపు, మాజీ మంత్రి బాలినేని ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని.. అందువల్లే వివాదం చెలరేగిందని మండిపడ్డారు. ఇక, తమ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలినేని.. అటు, టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు దామచర్ల రిమ్స్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి అక్కడికి చేరుకుని పోటా పోటీ నినాదాలు చేయడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రిమ్య్ క్యాజువాలిటీలో పలు అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఇరు పార్టీల నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈసీ సీరియస్
అటు, ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘర్షణకు గల కారణాలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని వెల్లడించింది.
Also Read: SCR: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి!