విద్యార్థులు రోజురోజుకూ మరీ సున్నితంగా మారుతున్నారు. ఎవరైనా మందలిస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారు ఒత్తిడిని జయించడంలో విఫలమవుతున్నారు. దాని ఫలితంగా విద్యార్థులు ప్రాణలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష ఉండగా.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
తమిళనాడులోని సేలం జిల్లా కూలియూరు గ్రామానికి చెందిన ధనుష్ అనే విద్యార్థి 2019లో ఇంటర్ సెకండియర్ పాసయ్యాడు. ఇదివరకే రెండు పర్యాయాలు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష రాశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేడు మూడో పర్యాయం అతడు నీట్ 2021 పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కానీ తెల్లారేసరికి ధనుష్ విగతజీవిగా కనిపించాడు. రాత్రి కుమారుడు చదువుకుంటుండగా తల్లిదండ్రులు నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి కుమారుడి గదికి వెళ్లి చూడగా షాకయ్యారు. తమ కుమారుడు ఉలుకుపలుకు లేకుందా ఉన్నాడు. ఎంత లేపినా అతడు కళ్లు తెరవలేదు. పరీక్ష నేపథ్యంలో కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మెట్టూరు ఆసుపత్రికి డెడ్ బాడీ తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
మరోసారి ఫెయిల్ అవుతాననే భయమా..
ధనుష్ ఇదివరకే రెండు పర్యాయాలు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాడు. ఈసారి పరీక్షలో ఫలితాలు ఎలా వస్తాయోనని ఆందోళనకు గురయ్యాడు. దాంతో ఒత్తిడిని జయించలేక, పరీక్ష భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చదువు గురించి అతడు చాలా ఒత్తిడిని గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్నాడని, తాజాగా నీట్ పరీక్ష ముందురోజు అతడు తనువు చాలించాడు.
Also Read: Doctor Suicide: ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. హోటల్‌లో పిల్లల డాక్టర్ ఆత్మహత్య
తన ప్రాంతానికి చెందిన విద్యార్థి, నీట్ అభ్యర్థి ధనుష్ ఆత్మహత్యపై అన్నాడీఎంకే కీలక నేత, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు. నీట్ అభ్యర్థి మరణంపై డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. నీట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి..
నీట్ పరీక్ష రాయాల్సిన విద్యార్థి ధనుష్ మరణంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. నీట్ నుంచి శాశ్వత మినహాయింపును కోరుతూ ఓ బిల్లును అసెంబ్లీలో పాస్ చేస్తామన్నారు.