ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17 నుంచి కిరాణా సరకుల (గ్రాసరీ)  డెలివరీ సర్వీసును నిలివేయనుంది. ప్రతి ఆర్డర్‌ విషయంలో విరామం బాగా ఉండడం.. డెలివరీలకు చాలా సమయం పడుతుండడం.. ఫలితంగా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ నెగటివ్‌గా ఉండడంతో ఆ సర్వీసును ఆపేయాలని జొమాటో నిర్ణయించింది. సొంతగా కిరాణా సరకులు డెలివరీ చేయడం కన్నా గ్రోఫర్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్‌-హౌస్ షేర్ హోల్డర్‌లకు మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్ముతున్నట్లుగా జొమాటో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.


కిరాణా సామాన్ల సర్వీసు నిలిపివేతపై జొమాటో సంస్థ తన భాగస్వాములకు ఒక మెయిల్ కూడా చేసింది. ‘‘జొమాటోలో మా వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించడంతో పాటు మా వ్యాపార భాగస్వాములు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడాలని మేం ఆశిస్తాం. కానీ, ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల ఇలా జరగడం లేదని మేం భావిస్తున్నాం. అందువల్లే పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ ప్రాజెక్టును సెప్టెంబరు 17 నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం.’’ అని జొమాటో సంస్థ చేసిన మెయిల్‌లో పేర్కొంది.


‘‘యాప్‌లో ఉండే స్టోర్ క్యాటలాగ్స్‌లో తరచూ పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వినియోగదారులు పెడుతున్న ఆర్డర్లలో చాలా గ్యాప్ వస్తుంది. డెలివరీ విషయంలో కస్టమర్ల నుంచి పూర్ ఎక్స్‌పీరియన్స్ వస్తోంది. దీనివల్ల 15 నిమిషాల్లో చేసే ఎక్స్‌ప్రెస్ డెలివరీ మోడల్ అంచనాలకు తగ్గట్లుగా అమలు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన మేం అంత తక్కువ సమయంలో డెలివరీ చేయడం చాలా కష్టమని అనిపించింది.’’ అని వ్యాపార భాగస్వాములకు చేసిన మెయిల్‌లో వివరించింది.


ఈ విషయంపై ఓ జాతీయ వార్తా సంస్థ జొమాటో అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ సర్వీసును నిలిపివేస్తున్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరే ఆలోచనలు చేయట్లేదు. గ్రాఫర్స్ సంస్థలో 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ అయ్యేలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. అందుకే అందులో జొమాటో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థలోని షేర్ హోల్డర్లకు మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నాం’’ అని తెలిపారు.


గ్రాఫర్స్‌లో రూ.745 కోట్ల పెట్టుబడులు
ప్రముఖ గ్రాసరీ డెలివరీ సంస్థ అయిన గ్రాఫర్స్‌లో జొమాటో 100 మిలియన్ డాలర్ల (రూ.745 కోట్లు) పెట్టుబడులు పెట్టి అందులో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.


Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!


Also Read: Bandi Sanjay: మీకు సోయే లేదు, అది అమలు చేయాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ