Who is Aruna Shanbaug: కోల్‌కతా హత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఓ అత్యాచార కేసు గురించి ప్రస్తావించారు. 1973లో ముంబయిలోని కేఈఎమ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న నర్స్ అరుణ శాన్‌బాగ్‌పై (Aruna Shanbaug Case) అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. అప్పటి నుంచి దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె కోమాలోనే ఉండి 2015లో మృతి చెందారు. మహిళా వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ ఈ కేసు ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళా ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో అత్యాచారం జరిగేంత వరకూ ఎదురు చూస్తూ ఉండలేమని, వైద్యుల భద్రతకు ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అయితే...ఆయన ప్రస్తావించి అరుణ శాన్‌బాగ్ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది. వైద్య రంగ చరిత్రలోనే ఇదో రక్తపు మరకగా మిగిలిపోయింది. 


హాస్పిటల్‌లో అత్యాచారం..


ముంబయిలోని KEM Hosptal లో 1967లో నర్స్‌గా చేరారు అరుణ శాన్‌బాగ్. అదే హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ సందీప్ సర్దేశాయ్‌తో అప్పటికే ఆమెకి నిశ్చితార్థమైంది. 1974లో వివాహం కావాల్సింది. కానీ ఆ కలలన్నీ ఒక్క రాత్రిలో చెదిరిపోయాయి. 1973 నవంబర్ 27వ తేదీన రాత్రి హాస్పిటల్‌లో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. కుక్కను కట్టేసే చైన్‌తో గొంతు బిగించాడు. ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ లైంగిక దాడిలో అరుణ శాన్‌బాగ్ తీవ్రంగా గాయపడ్డారు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు. కోమాలోకి వెళ్లిపోయారు. మెదడు తీవ్రంగా గాయపడడం వల్ల పక్షవాతం వచ్చింది. మాట్లాడలేకపోయారు. పూర్తిగా మరో మనిషిపైనే ఆధారపడి బతకాల్సి వచ్చింది. ఏ హాస్పిటల్‌లో అయితే ఆమె జీవితం ఇలా దుర్భరంగా మారిపోయిందే..అదే హాస్పిటల్ సిబ్బంది ఆమెని కుటుంబ సభ్యురాలిగా చూసుకుంది. హాస్పిటల్‌లో ప్రయోగాలు చేసేందుకు కొన్ని కుక్కలను తీసుకొచ్చారు. వాటికి పెట్టాల్సిన ఆహారాన్ని ఆ వార్డ్ అటెండర్ దొంగిలించడాన్ని అరుణ శాన్‌బాగ్ చూశారు. ఇది పై అధికారులకు చెబుతానని బెదిరించారు. దీంతో పగ పెంచుకున్న అటెండర్ ఇంత దారుణంగా ఆమెని అత్యాచారం చేశాడు. 


కారుణ్య మరణం కోసం పిటిషన్..


ఆమె బాధ చూడలేక 2011లో సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పింకీ విరాణి కారుణ్యమరణం అవకాశం కల్పించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌తో దేశవ్యాప్తంగా ఈ కేసు మరోసారి అలజడి సృష్టించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇదే సమయంలో passive euthanasia కి అనుమతినిచ్చింది. అంటే అప్పటి వరకూ ఆమెకి అందిస్తున్న అత్యవసర వైద్యాన్ని ఆపేయచ్చు. అయితే...ఆమె బంధువులు లేదా కేర్‌టేకర్స్ నుంచి పిటిషన్‌లు వస్తే తప్ప ఇందుకు అనుమతి ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. దాదాపు 42 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన అరుణ శాన్‌బాగ్ 2015 మే 18న న్యుమోనియో కారణంగా కన్ను మూశారు. ఈ కేసులో నిందితుడిపైన హత్యాయత్నం కేసు పెట్టి ఏడేళ్ల జైలుశిక్షతో సరిపెట్టారు. 1980లో నిందితుడు విడుదలయ్యాడు. 


Also Read: Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం