Kolkata Doctor Murder Case: కోల్‌కతా హత్యాచార కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై ఈ దారుణానికి పాల్పడే ముందు నిందితుడు సంజయ్ రాయ్ రెడ్‌ లైట్ ఏరియాకి వెళ్లాడని విచారణలో తేలింది. డాక్టర్‌పై హత్యాచారం చేసే కొద్ది గంటల ముందు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు వెల్లడైంది. ఇద్దరి వేశ్యల వద్దకి వెళ్లి ఆ తరవాత  హాస్పిటల్‌కి వచ్చాడు నిందితుడు. బెంగాల్‌లో సోనాగచిలో ఈ చీకటి వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 8వ తేదీన రాత్రి అక్కడికి సంజయ్ రాయ్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయానికి మద్యం మత్తులో ఉన్నాడు. ఇద్దరి దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్‌కి వచ్చాడు. 


జూనియర్ డాక్టర్ నిద్రిస్తున్న సెమినార్ రూమ్‌లోకి వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. అక్కడే ఓ బ్లూటూత్ డివైజ్ కూడా దొరికింది. హాస్పిటల్‌లోకి వచ్చే ముందు సంజయ్ రాయ్ మెడలో అది కనిపించింది. దీని ఆధారంగానే అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతే కాదు. "నేనేం తప్పు చేయలేదు. ఉరి తీసుకుంటే తీసుకోండి" అని సమాధానమిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అయితే...లై డిటెక్టర్ టెస్ట్‌ కోసం కోర్టుని CBI అనుమతి కోరింది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం వెంటనే అనుమతినిచ్చింది. (Also Read: Kolkata Red Light Area : అందుకోసమైతే మేమున్నాం - అత్యాచారాలు వద్దు - కోల్‌కత సెక్స్ వర్కర్స్ పిలుపు)


దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు జరుగుతున్నా కోల్‌కతాలో ఈ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. "జస్టిస్ ఫర్ అవర్ సిస్టర్" అంటూ వైద్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆర్‌జీ కార్ హాస్పిటల్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూప్ దత్తకి సాన్నిహిత్యం ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. దీని ఆధారంగానే అనూప్ దత్తని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సివిక్ వాలంటీర్‌కి హాస్పిటల్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌లతోనూ ఎలా పరిచయం ఉంది..? అక్కడ ఎప్పుడంటే అప్పుడు అంత సులువుగా వెళ్లగలిగే చొరవ ఎవరు ఇచ్చారు..? అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అయితే...అనూప్ దత్త, సంజయ్ రాయ్ కలిసి దిగిన ఫొటోలు సీబీఐ అధికారుల కంటపడ్డాయి.


 ప్రస్తుతం వీటినీ ఆధారాలుగా పరిగణిస్తున్నారు. సంజయ్ రాయ్ ఎలా తెలుసు అన్న ప్రశ్నకి అనూప్ దత్త సమాధానం ఇవ్వడం లేదు. మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు సభ్యులతో కూడిన సిట్ ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యుటీ సూపరింటెండెంట్‌తో మాట్లాడుతోంది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై విచారణ జరిపింది. వైద్యుల భద్రత కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనను ఆత్మహత్యగా చెబుతున్నప్పుడు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది ధర్మాసనం. నిరసనలు తెలిపే వాళ్లపై బలప్రయోగం చేయొద్దని స్పష్టం చేసింది. 


Also Read: Kolkata Doctor Case: కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు- తెలుగు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి చోటు