Students Protests In Gudlavalleru Engineering College: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ (Gudlavalleru Engineering College) హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల ఆరోపణల అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి కాలేజీ ప్రాంగణంలో విద్యార్థినులు ఆందోళనకు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థిని మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. 'సీక్రెట్ కెమెరా గురించి చెబుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. హాస్టల్ బాత్ రూంలో రహస్య కెమెరా ఉందన్న విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గురువారం సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలన్నారు. మళ్లీ రాత్రికి రాత్రే ఈ న్యూస్ ఫేక్ అని ప్రచారం చేశారు. మా మీద రివర్స్ కేసులు ఎందుకు పెడుతున్నారు.? మేమేం చేశాం.?. న్యాయం కోరడమే నేరమా.?.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు, ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో కాలేజీకి యాజమాన్యం సెలవు ప్రకటించింది.


మరోవైపు, విద్యార్థి సంఘాల నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనలు చేశారు. గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు హాస్టల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 'కాలేజీ వాష్ రూమ్‌లో ఒక కెమెరా దొరికింది. అందులో ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇంకా తెలియదు. పోలీసులు వచ్చాక మాత్రం అలాంటివేవీ లేవని చెబుతున్నారు. ఎప్పుడూ సెలవు ఇవ్వని కాలేజీ యాజమాన్యం అర్థంతరంగా సెలవు ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదు. విచారణ ట్రాన్స్‌పరెంట్‌గా జరగడం లేదు. ఒక రాజకీయ నాయకుడి కూతురి సహకారంతోనే ఈ ఘటన జరిగింది. ఆమెను కాలేజీ యాజమాన్యం, పోలీసులు కలిసి సేవ్ చేస్తున్నారు. వాస్తవాలు బయటకు రాకుండా పోలీసులతో మమ్మల్ని అడ్డుకుంటున్నారు. న్యాయం జరిగే వరకూ, నేరస్తులను పట్టుకుని శిక్షించే వరకూ మేము పోరాటం చేస్తాం.' అని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.


ఇదీ జరిగింది


కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలోని (Gudlavalleru Engineering College) అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాను కొందరు విద్యార్థినులు గురువారం గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయే ఈ దారుణానికి పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీయిస్తున్నట్లు చెప్పారు. ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజీ వర్గాలు, విద్యార్థులు అనుమానిస్తున్నారు. 


ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేశారు. హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపు చేసి.. ఆ విద్యార్థి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.


కాలేజీకి మంత్రి కొల్లు


మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయన్న విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన ఘటనను విద్యార్థినులు మంత్రికి వివరించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని.. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని మంత్రి తెలిపారు. కాలేజీల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.


షర్మిల భావోద్వేగ ట్వీట్


అటు, ఈ ఘటనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లో పర్యవేక్షణ పట్ల యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అమానవీయ ఘటన విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. 'ఓ ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. కాసుల కక్కుర్తి తప్ప.. భద్రతా ప్రమాణాలను యాజమాన్యాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. దీనిపై ఫాస్ట్రాక్ విచారణ జరగాలి.' అంటూ ట్వీట్ చేశారు.






Also Read: Kadambari Jethwani: విచారణాధికారి ఎదుట కాదంబరి జత్వానీ హాజరు - తనకు ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి