Reliance Industries Bonus Shares: రిలయన్స్ ఇండస్ట్రీస్, తన 35 లక్షల మంది షేర్‌హోల్డర్లు, వాటాదార్లకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కో రిలయన్స్‌ షేర్‌కు మరో షేరును బోనస్‌గా ఇవ్వబోతోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు సెప్టెంబర్ 05న సమావేశం అవుతోంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం (Reliance Industries AGM 2024) ప్రారంభానికి ముందు, స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. "సెప్టెంబర్ 05, 2024న రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ మీటింగ్‌ ఉంటుంది. షేర్‌హోల్డర్‌లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చే ప్రతిపాదనను ఆ సమావేశంలో పరిశీలించి, నిర్ణయం తీసుకుంటారు" అని ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో RIL వెల్లడించింది. డైరెక్టర్ల సమావేశంలో ఆమోదముద్ర తర్వాత, షేర్‌హోల్డర్‌లకు ఒక్కో షేర్‌కు బదులుగా ఒక షేర్‌ను బోనస్‌గా దక్కుతుంది. దీనికి సంబంధించి రికార్డ్‌ డేట్‌ను త్వరలో నిర్ణయిస్తారు. రికార్డ్‌ తేదీ నాటికి రిలయన్స్‌ షేర్లు ఉన్న అందరికీ బోనస్‌ షేర్లు దక్కుతాయి.


10 షేర్లకు మరో 10 షేర్లు "ఫ్రీ"
ఉదాహరణకు... రికార్డ్‌ డేట్‌ నాటికి ఒక షేర్ హోల్డర్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 10 షేర్లు ఉంటే, అతనికి మరో 10 బోనస్ షేర్లు జారీ అవుతాయి. అవి ఆటోమేటిక్‌గా అతని డీమ్యాట్‌ ఖాతాలో క్రెడిట్‌ అవుతాయి. కొత్తగా వచ్చిన 10 షేర్లు, అప్పటికే ఉన్న 10 షేర్లు కలిపి, అతని డీమ్యాట్‌ అకౌంట్‌లో మొత్తం 20 రిలయన్స్‌ షేర్లు కనిపిస్తాయి. 


బోనస్‌ షేర్ల వల్ల లాభమా, నష్టమా?
అయితే, ఇక్కడో విషయాన్ని షేర్‌హోల్డర్లు గమనించాలి. బోనస్‌ షేర్లు జారీ అయిన రోజే, అదే నిష్పత్తిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర తగ్గుతుంది. ఉదాహరణకు, ఒక్కో RIL షేర్‌ ప్రైస్‌ రూ.3000 దగ్గర ట్రేడవుతుంటే, బోనస్‌ షేర్లు జారీ కాగానే షేర్‌ ధర సగానికి సగం, అంటే రూ.1500 తగ్గుతుంది. రూ.1500 దగ్గర రిలయన్స్ షేర్‌ ట్రేడ్‌ అవుతుంది. అంటే, షేర్ల సంఖ్య రెట్టింపు అయినప్పటికీ, షేర్‌ ధర సగానికి సగం తగ్గడం వల్ల మొత్తం విలువలో ఎలాంటి మార్పు రాదు. అయితే... షేర్‌ ధర భారీగా తగ్గడం వల్ల ఇంకా ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేర్‌ ప్రైస్‌ అందుబాటులోకి వస్తుంది. బిగ్‌ బాయ్స్‌కు కూడా షేర్లను కొనడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫలితంగా, రిలయన్స్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగి, ధర కూడా పెరగడానికి ఛాన్స్‌ ఉంది.


ఈ రోజు (శుక్రవారం, 30 ఆగస్టు 2024) ఉదయం 10.50 గంటల సమయానికి, రిలయన్స్ షేర్‌ 0.47% తగ్గి రూ.3,026.70 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఈ స్టాక్‌ గత 6 నెలల కాలంలో 3.49%, గత 12 నెలల కాలంలో 25.16% పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫెడ్‌ రేట్ల ప్రభావంతో పసిడి మెరుపులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి