AP Deputy CM Pawan Kalyan Comments In Vana Mahotsavam: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతోన్న వన మహోత్సవం (Vana Mahotsavam) ఓ సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని అన్నారు. 'దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలు అక్కడ విరివిగా పెంచారు. అనంతరం ఆ మొక్కల వల్ల జరిగే దుష్ప్రభావాన్ని అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి. దీని వల్ల జరిగే అనర్ధాలు అధికం. భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడం సహా చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనో కార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడు పెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమి కీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచడం సరికాదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను పెంచడం మానేయాలి. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్‌ను నిషేధించాయి. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
'జీవోఐఆర్ పునరుద్ధరణ'
పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో.. ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయో అనేది తెలుసుకోవడం ప్రజల హక్కు అని గురువారం ట్విట్టర్ వేదికగా చెప్పారు. 'ప్రభుత్వ శాఖలు ఏ ఉత్తర్వులు ఇస్తున్నాయో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గత పాలకులు వాటిని గోప్యంగా ఉంచి ప్రజలకు సమాచారం అనేదే లేకుండా చేశారు. కానీ, మా ప్రభుత్వం అలాంటి నియంతృత్వ పోకడలను తోసిపుచ్చుతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని చెప్పడానికి ఈ వెబ్ సైట్ పనురద్ధరణే ఓ ఉదాహరణ.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.