Mumbai Actress Kadambari Jethwani In Vijayawada: ముంబయి నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) కేసు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకున్నారు. అత్యాచారం కేసు నుంచి అన్ని పరిణామాలను ఆమె వివరించారు. వీటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో బంధించిన సమయంలో ఏయే పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పిన నటి జత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2023 డిసెంబర్ నుంచి కేసు పెట్టి.. 2024, మార్చి వరకూ జరిగిన ఘటనలు ఆమె వివరించారు. జత్వానీ వివరణను స్టేట్‌మెంట్, వీడియో రూపంలో కేసు విచారణాధికారులు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు.


'ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది'


ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి తనను అనేక విధాలుగా వేధించారని నటి జెత్వానీ ఆరోపించారు. ఆ అధికారులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. వీటన్నింటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని చెప్పారు. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు సర్కారు తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. డబ్బుల కోసమే ఇలా మాట్లాడాతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.


ఇదీ జరిగింది


ముంబైకి చెందిన డాక్టర్, నటి కాదంబరి జెత్వానీ పలు మీడియా ఛానెళ్లతో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారని.. తనతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా వేధించారని ఆరోపించారు. 40 రోజుల పాటు నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకుని వదిలి పెట్టారని అన్నారు. ఈ అంశం సంచలనంగా మారిన క్రమంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఎంవోకు ఇంటలిజెన్స్ అధికారులు, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నివేదికలు సమర్పించారు. తీవ్ర ఆరోపణలు కావడంతో కేసు దర్యాప్తునకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తన భద్రత, తన కుటుంబ భద్రతపై నటి ఆందోళన వ్యక్తం చేస్తోన్న క్రమంలో ఆమె వద్ద నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఆ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్లిన బృందం మొత్తాన్ని ఓసారి పిలిపించి మాట్లాడారు.  


కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తమను రూ.5 లక్షలకు నటి కాదంబరి జెత్వానీ మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి.. విమానాల్లో ముంబైకి వెళ్లి ఆ కుటుంబాన్ని పోలీసులు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఓ సినీ నటిని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. అయితే కాదంబరి జెత్వానీ కుటుంబాన్ని తీసుకొచ్చి 40 రోజులు విజయవాడలో ఉంచినా సరే మీడియాకు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా అంతర్గతంగానే ఉంచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బెయిల్ కూడా పోలీసులు ఇప్పించి ముంబైకి పంపినట్లుగా సమాచారం. అప్పటికే సెటిల్మెంట్ పై సంతకాలు పెట్టించుకున్నారని అంటున్నారు. దీనిపైనే నటి ఆరోపణలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


Also Read: Gudlavalleru Engineering College: ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత