సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను దోచుకునేందుకు ఉన్న ఏ ఒక్క మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. లింక్‌లు, మెసేజ్‌లు, వాట్సాప్‌ చాట్‌లు, ఓటీపీలు పేరుతో అమాయకుల అకౌంట్లను కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సెక్సార్షన్‌. సెక్సార్షన్‌ అంటే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్‌ వీడియో కాల్స్‌. అవతలి వ్యక్తి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేయగానే న్యూడ్‌గా ఉంటూ అవతలి వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ మొత్తాన్ని వీడియో రికార్డ్‌ చేస్తారు. ఆ తరువాత సదరు వ్యక్తులకు కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తారు. ఈ వ్యవహారాన్ని సెక్సార్షన్‌గా పిలుస్తారు. దీనిపై కేంద్రం హోంశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పెట్టుబడుల ప్రణాళిక పేరుతో మిస్స్‌డ్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, మారు పేర్లతో సందేశాలు పంపిస్తున్నారు. వీటిన్నింటితో పోలిస్తే సెక్సార్షన్‌ ప్రమాదకరమమైన నేరంగా కేంద్ర హోంశాఖ పరిధిలోని నిపుణుల బృందమైన బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్డీ) వినియోగదారులను హెచ్చరించింది. 


ఆ కాల్స్‌కు దూరంగా ఉండాలి


తెలియన నెంబర్లతో వచ్చే వీడియో కాల్స్‌కు దూరంగా ఉండడం ద్వారా ఈ తరహా సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశముంది. ఇటువంటి కాల్స్‌ ఎక్కువగా కెన్యా, వియత్నాం, ఇథియోఫియా, మలేషియా నుంచి వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండే వారిని గుర్తించి వారికి కాల్స్‌ చేస్తున్నారు. ఇటువంటి ఫోన్లకు స్పందిస్తే చిక్కుల్లో పడినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వినియోగించాలని బీపీఆర్డీ సూచించింది. 


ఎనిమిది పేజీల సూచనలు.. 


సైబర నేరాలు దేశ వ్యాప్తంగా పెరుగుతుండడం, అమాయకులు ఆ మోసాలకు గురై తీవ్రంగా నష్టపోతుండడంతో బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్డీ) అప్రమత్తమై.. ప్రజలను అలెర్ట్‌ చేస్తోంది. వివిధ రకాల సైబర్‌ నేరాలు, వాటికి పాల్పడే తీరు, వాటి నుంచి ఎలా వినియోగదారులు తమను తాము రక్షించుకోవచ్చన్న వివరాలను తెలియజేస్తూ.. ఎనిమిది పేజీల సూచనలను తాజాగా వీడిడుదల చేసింది. ఆయా సూచనలు ప్రకారం తెలియని నెంబర్లు నుంచి వచ్చే వీడియో కాల్స్‌, సాధారణ కాల్స్‌కు స్పందించకపోవడం, తెలియని లింక్స్‌ ఓపెన్‌ చేయకపోవడం, ఓటీపీ షేర్‌ చేయకపోవడం వంటి వాటితోపాటు కీలకమైన అంశాలు ఉన్నాయి.