శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బావమరిది హల్చల్..
- చేతులు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన సామాను శ్రీధర్ రెడ్డి..
- పోలీసులు ముందే సూసైడ్ అటెంప్ట్ చేసిన సామాను శ్రీధర్ రెడ్డి..
- గత రెండేళ్లుగా బావ వర్సెస్ బావమరిదిగా మారిన వ్యవహారం..
- ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణికి సొంత అన్న శ్రీధర్ రెడ్డి
Srikalahasti MLA Biyyapu Madhusudhan Reddy: తిరుపతి : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది సామాను శ్రీధర్ రెడ్డి పోలీసులు ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యేకు ఆయన బామ్మర్దికి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు, అనంతరం కొద్ది కాలం బియ్యపు మధుసూదన్ రెడ్డికి అన్ని వ్యవహారాలను చూస్తూ అత్యంత సన్నిహితునిగా, అనుచరునిగా సామాన్ శ్రీధర్ రెడ్డి ఉండేవారు. అయితే మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి.
ముఖ్యంగా అధికారిక విషయాల్లో బావమరిది జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు రావడంతో ఆయనను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చారు. ఈ దూరం రాను రాను మరింతగా పెరిగింది. అది కాస్త సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వరకు వెళ్లింది. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన పోలీసులు ముందే సామాను శ్రీధర్ రెడ్డి కత్తితో రెండు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
బి. మధుసూదన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన జగన్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో 7583 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మేనియా, వైఎస్సార్సీపీ హవాలో మధుసూదన్ రెడ్డి గెలుపొందారు. అయిదేళ్ల కిందట ఏ ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారో అదే అభ్యర్థి.. టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై 38,141 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
నవరత్న నిలయం
బి. మధుసూదన్ రెడ్డి 'జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను గుడి కట్టించారు. ఈ నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా అద్దాల గోపురాన్ని నిర్మించారు. ఈ అద్దాల మహల్ లో రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించగా అందులోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తాయి. వైఎస్ జగన్ తిరుపతి, శ్రీకాళహస్తి పర్యటన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మించిన నవరత్న నిలయం హాట్ టాపిక్ అవుతోంది.