కొన్ని రోజులుగా విశాఖలో నేవీ డే సంబరాల కోసం భారత నౌకాదళం పెద్ద ఎత్తున రిహార్సల్స్ చేస్తుంది . విశాఖ లో ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనపడుతోంది. అయితే ఏంతో ప్రతిష్టాత్మకమైన ఈ నేవీ డే పుట్టుక ఎలా జరిగింది. దీని వెనుక ఉన్నచరిత్ర ఏంటి అనేదానిపై నేటి తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి వింటే యాక్షన్ సినిమాల తలదన్నే సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతాయి. 


1971లో పాక్ పై దాడి చేసి 4 ఓడలను ధ్వంసం చేసిన భారత నేవీ 


1971 లో భారత్ -పాకిస్తాన్ ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. అయితే ప్రధాన యుద్ధం మాత్రం నౌకాదళాల కేంద్రంగా జరిగింది. ఇండియాలోని విశాఖపట్నాన్ని పాక్ టార్గెట్ చేసుకుంటే.. పాక్ లోని కరాచీ హార్బర్ ను ఇండియా ఫిక్స్ చేసింది. కరాచీపై దాడికి  "ఆపరేషన్ ట్రైడెంట్ "  అని పేరు పెట్టారు. దానిలో భాగంగా 4 డిసెంబర్ 1971 రాత్రి 10:30కు భారత నౌకాదళం కరాచీ వైపు దూసుకువెళ్లింది. అప్పటికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు రాత్రిపూట బాంబులు వేసే సామర్థ్యం లేదు. అందుకే రాత్రి పూటనే దాడికి ఎంచుకుంది ఇండియన్ నేవీ. ఇండియాకు చెందిన INS నిర్గత్ నౌక పాకిస్తాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన PNS ఖైబర్ అనే డిస్ట్రాయర్ శ్రేణికి చెందిన నౌకపై మిస్సైల్స్ తో దాడి చేసి ముంచేసింది. అదే సమయంలో భారత్ కు చెందిన మరో యుద్ధనౌక INS నిపట్ ఏకంగా రెండు పాకిస్తాన్ ఓడలను ముంచేసింది. వాటిలో ఒకటి సి -క్లాస్ కు చెందిన డిస్ట్రాయర్ నౌక PNS షాజహాన్ కాగా మరొకటి పాక్ యుద్ధ నౌకలకు కావాల్సిన సరంజామా ను, ఆయుధాలను సప్లై చేసే MV వీనస్ ఛాలెంజర్ అనే షిప్. ఆ సమయంలో MV వీనస్ ఛాలెంజర్ నిండా పాకిస్తాన్ షిప్స్ కు చేరాల్సిన ఆయుధాలు ఉండడంతో ఇండియన్ మిస్సైల్స్ దాటికి వెంటనే పేలిపోయింది.  



గంట వ్యవధిలోనే 4 ఓడలు ధ్వంసం


ఇక ఇండియాకు చెందిన మరో యుద్ధ నౌక INS వీర్ అదే రోజు రాత్రి 11:20 ప్రాంతంలో పాకిస్తాన్ యుద్ధ నౌక PNS ముహఫిజ్ పై దాడి చేసి దానిని ధ్వంసం చేసింది. ఈ దాడి ఎంత వేగంగా జరిగింది అంటే కనీసం తాము ఆపదలో ఉన్నామని, ముహఫిజ్ కు చెందిన సైనికులు  నావికులు వారి ప్రధాన కేంద్రానికి సిగ్నల్ కూడా పంపలేకపోయారు. దానితో గంట వ్యవధిలోనే పాకిస్తాన్ తనకు చెందిన 4 కీలక ఓడలను పోగొట్టుకుంది. వాటిలో రెండు నౌకలను ధ్వంసం చేసిన INS నిపట్ ఇంకా ముందుకు వెళ్లి కరాచీ హార్బర్ లో ఆయిల్ స్టోరేజీ ట్యాంకులను మిస్సైల్స్ తో పేల్చేసింది. అనంతరం భారత్ కు చెందిన నౌకాదళం సేఫ్ గా ఇండియా చేరుకోగా పాకిస్తాన్ నేవీ పూర్తిగా దెబ్బతింది. దీనికి బదులుగా ఆ తెల్లారి పాక్ కు చెందిన విమానాలు గుజరాత్ లోని ఓఖా పోర్ట్ పై విమానాలతో దాడి చేసి అక్కడి ఆయిల్ స్టోరేజీ ట్యాంకులను ధ్వంసం చేసింది. అయితే దీనిని ముందే ఊహించిన భారత్ ముందుగానే వాటిని ఖాళీ చేసిపెట్టడంతో ఎలాంటి నష్టం జరగలేదు. 



(PNS khaibar)


మనవాళ్లు అంతా సేఫ్ -అటువైపు వందల్లో ప్రాణనష్టం 
 
వేరే దేశానికి వెళ్లి అక్కడి నౌకాదళాన్ని, పోర్టును ధ్వంసం చేసి ఒక్క ప్రాణం కూడా పోకుండా సేఫ్ గా రావడం అనేది అంతకు ముందు ఏ నౌకాదళంలోనూ  జరగలేదు. దానితో రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో జరిగిన అత్యంత సక్సెస్ ఫుల్ నేవీ ఆపరేషన్ గా ఆపరేషన్ ట్రైడెంట్ కు గురింపు వచ్చింది. ఈ దాడికి నేతృత్వం వహించిన వారికీ అందులో పాల్గొన్న సైనికులు, నావికులు అందరికీ అవార్డులు, పతకాలు, బిరుదులు ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం.  




(PNS muhafiz)


వైజాగ్ లో పాక్ సబ్ మెరైన్  ఘాజీని ముంచేసిన ఇండియన్ నేవీ 
 
ఆ యుద్ధంలో భాగంగానే భారత ప్రతిష్టాత్మక యుద్ధ నౌక INS విక్రాంత్ ను ధ్వంసం చెయ్యడానికి వైజాగ్ తీరానికి చేరిన పాక్ సబ్ మెరైన్  PNS ఘాజీని ఇండియన్ నేవీకి చెందిన INS రాజ్ పుత్ విశాఖ తీరంలోనే ముంచేసింది. ఈ సంఘటన కూడా 4 డిసెంబర్ 1971 లో  జరిగింది. దానితో పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకుంటూ రాజీకి వచ్చింది.  ఈ రెండు అతిగొప్ప నౌకాదళ విజయాలకు గుర్తుగా డిసెంబర్ 4న భారత్ నౌకాదళ దినోత్సవంగా ప్రకటించింది భారత ప్రభుత్వం.  ఆ యుద్ధంలో విజయంతో పాటు యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా విశాఖలోని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద ప్రతీ ఏడాది డిసెంబర్ 4న నేవీ డే జరుగుతుంది. ఉదయం నివాళి కార్యక్రమం జరిగితే సాయంత్రం పూట ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు పెద్దఎత్తున జరుగుతాయి. వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుండో ప్రజలు పెద్దఎత్తున విశాఖ బీచ్ కు చేరుకుంటారు. ఇక ఈ ఏడాది అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేవీ డే ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు .కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నేవీ డే ఉత్సవాలు జరగలేదు. దానితో ఈ ఏడాది ఘనంగా వాటిని జరుపబోతోంది ఇండియన్ నేవీ.