Srikalahasti News : తిరుపతి జిల్లాల్లో రోజురోజుకూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకూ తాళాలు వేసిన ఇళ్లు టార్గెట్ చేసిన దొంగలు తాజాగా ఫైనాన్స్ సంస్థను దోచేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగిని నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఫైనాన్స్ సంస్థలోని 80 లక్షల రూపాయల విలువైన బంగారు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.  


అసలేం జరిగింది? 


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దమసీదు వీధిలో గత మూడేళ్లుగా ఫిన్కోర్ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ అవసరాల నిమిత్తం బంగారు నగలను ఈ సంస్థలో కుదువ పెట్టి నగదు తీసుకెళ్తుంటారు. వారి అవసరాలు తీరిన తరువాత నగదు చెల్లించి తిరిగి బంగారు నగలను తీసుకెళ్తుంటారు. ఫైనాన్స్ సంస్థలో వివిధ ప్రదేశాల నుంచి  వచ్చిన వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం ఆఫీస్ లో పనులు పూర్తి అయ్యాక సిబ్బంది అంతా రోజు మాదిరిగానే ఇళ్లకు వెళ్లిపోయారు. ఫైనాన్స్ సంస్థలో పనిచేసే క్లర్క్ స్రవంతికి ఆఫీస్‌కు సమీపంలోనే నివాసం ఉంటోంది. ఆఫీసులో పనులు ఉండటంతో నిన్న రాత్రి పదిన్నర గంటల వరకు ఆమె అక్కడే ఉండి కార్యాలయం లోపల తన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బంగారం తాకట్టు పెట్టుకుని నగదు ఇచ్చే సంస్థ కావడంతో ఆ సమయంలో బంగారం, నగదు లెక్కలను చూసుకుంటూ ఉన్నారు. 



రూ.80 లక్షల ఆభరణాల దొంగతనం


ఈ విషయం పసిగట్టిన కొందరు దుండగులు ఒక్కసారిగా కార్యాలయంలోని ప్రవేశించారు. కార్యాలయంలో ఉన్న క్లర్క్ స్రవంతిని అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. ఆ సమయంలో కొంత ధైర్యం తెచ్చుకున్న క్లర్క్‌ స్రవంతి వారిని ఎదురించే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు స్రవంతి నోటిలో బట్టలు కుక్కి, కాళ్లు, చేతులను తాడుతో కట్టిపడేశారు. దాదాపు రూ.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదును దుండగులు దోచుకుని పరారయ్యారు. నోట్లో కుక్కిన గుడ్డను తొలగించుకున్న స్రవంతి గెట్టిగా కేకలు వేయడంతో చుట్టూ పక్కల ఉన్న ప్రజలు కార్యాలయానికి చేరుకుని స్రవంతిని విడిపించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. డీఎస్పీ విశ్వనాథ్ ఘటన స్థలాన్ని పరిశీలించి ఫిన్కోర్ సంస్థలో విధులు నిర్వర్తించే సిబ్బందిని విచారించారు. తరువాత శ్రీకాళహస్తిలోని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. దుండుగుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.