Man Murdered Pretext of Black Magic in Siddipet: శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని చోట్ల మూఢ నమ్మకాలు వీడడం లేదు. తాజాగా, మంత్రాలు చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నుంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన కుమార్తె అనారోగ్యానికి మరో వ్యక్తి మంత్రాలు చేయడమే కారణమని భావించి అతన్ని హతమార్చాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తుల రజిత, తిరుపతి దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండగా.. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అదే గ్రామానికి చెందిన బండి వెంకటయ్య మంత్రాలు వేయడమే దీనికి కారణమని తిరుపతి భావించాడు. వెంకటయ్యను చంపితేనే తన కూతురి ఆరోగ్యం కుదుట పడుతుందని.. అతన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందు కోసం పరశురాములు, సాయిగౌడ్ తో కలిసి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత మరో రూ.లక్ష వారికి చెల్లించాడు. వెంకటయ్యను చంపిన తర్వాత మిగతా మొత్తం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్లాన్ ప్రకారం
ఈ మేరకు ప్లాన్ ప్రకారం ఈ నెల 3న పరశురాములు, సాయిగౌడ్ తో పాటు సాయి, రంజిత్, అరవింద్.. బైక్ పై వెళ్తున్న వెంకటయ్యను మరో బైక్ పై వెంబడించారు. అనంతరం అతన్ని బైక్ తో ఢీకొట్టారు. కింద పడ్డ వెంకటయ్యను వారితో తెచ్చుకున్న తువ్వాలు, తాడు సాయంతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని, బైక్ ను సమీపంలోని జేసీబీ గుంటలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే, వెంకటయ్య కుటుంబ సభ్యులు అతని కోసం గాలించి గుంటలో అతన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించగా.. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలు గుర్తించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
వృద్ధుడి దారుణ హత్య
ఓ వృద్ధుడి భిక్షాటన డబ్బుల కోసం అతన్ని ఓ ఆటో డ్రైవర్ దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన వెంకటయ్య (69) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే భిక్షాటన చేసి గ్రామానికి తిరిగి వచ్చేందుకు శుక్రవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ ఆటో ఎక్కాడు. వృద్ధుడి దగ్గర డబ్బులు గుర్తించిన ఆటో డ్రైవర్ వాటిని కాజేసేందుకు ప్లాన్ చేశాడు. మార్గమధ్యలో ఆటోను దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన డబ్బు మూటను లాక్కునేందుకు యత్నించగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వెంకటయ్యపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇద్దరూ సమీపంలోని బావిలో పడిపోయారు. బావిలోనే రాఘవేందర్.. వెంకటయ్యను చంపి బయటకు వచ్చేందుకు యత్నించాడు. బావిలో నుంచి పైకి వస్తున్న రాఘవేందర్ ను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని బావిలోంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల చేతిలో గాయపడ్డ నిందితుడు రాఘవేందర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.