Bhatti Comments on Dharani Portal in Assembly: బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన 'ధరణి' (Dharani) పోర్టల్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. 'ధరణి' కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి భారంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామని వెల్లడించారు. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి ఇప్పటికే ఓ కమిటీ వేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ లోపల అర్బన్ జోన్ గా, ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య పెరి అర్బన్ జోన్, ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతాన్ని గ్రామీణ జోన్ గా ఏర్పాటు చేస్తామన్నారు.
'ఆ తప్పులు సరిదిద్దుతాం'
గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతామని మంత్రి భట్టి తెలిపారు. మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని.. అంత ఖర్చు చేసినా ఇప్పటికీ సురక్షిత తాగు నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయని అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారు. వీటి నిబంధనలు పునఃసమీక్ష చేస్తాం. స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం. అన్ని పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తాం. నీటి పారుదల రంగంలో సమస్యలు అధిగమిస్తాం. నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం శాపంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ప్రకటిస్తాం.' అని పేర్కొన్నారు.
'వాస్తవానికి దగ్గరగా'
వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ లో పథకాలకు కేటాయింపులు చేశామని భట్టి తెలిపారు. 'గత ప్రభుత్వ హయాంలో మహిళలకు రూ.7,848 కోట్ల బడ్జెట్ పెట్టి కేవలం రూ.2,685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల్లో గతేడాదితో పోలిస్తే రూ.13,02,371 కోట్ల నుంచి రూ.14,49,708 కోట్లకు పెరిగింది. ఆర్ధిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.' అని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మాజ్యోతిబాపూలే భవన్ గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశామన్నారు. ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నామని చెప్పారు. ఈ 2 నెలల్లో 43,054 ధరఖాస్తులు వస్తే, వాటిలో 14,951 ఇండ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ల గురించి, 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చినట్లు వెల్లడించారు. అన్నీ సమస్యలు పరిష్కరించేలా చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.