Bihar Govt Floor Test: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫిబ్రవరి 12వ తేదీన అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోడంలో భాగంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానం తీసుకురానున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల అజెండాని ప్రకటించింది సర్కార్. ఫిబ్రవరి 12న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తరవాత ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ అవాద్ బిహార్ చౌదరిని తొలగించేందుకు తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆయనపై అవిశ్వాస తీర్మానం జారీ చేశారు. సివాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చౌదరి...గత ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ఇంకా రాజీనామా చేయలేదు. రాజీనామా లేఖని ఇచ్చేందుకూ ఆయన అంగీకరించలేదు. రాజ్యాంగ ప్రకారం పదవీకాలం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అదే పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. చౌదరిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరవాత తమ బలాన్ని నిరూపించుకోనున్నారు నితీశ్ కుమార్. ప్రభుత్వం ఈ తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చోరని చాలా గట్టిగా చెబుతున్నారు నేతలు. బిహార్‌లో 243 నియోజకవర్గాలుండగా...NDA ప్రభుత్వానికి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. RJD, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు 114 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో RJDలోనే అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఈ పార్టీలు ఏ ఒక్క ఎమ్మెల్యేనీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. అటు NDA ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రహోం మంత్రి అమిత్‌షా బిహార్ నేతలతో సంప్రందింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లకు తరలించింది.
9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా జనవరి 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చిన నితీశ్...బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు గవర్నర్‌కి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఆ తరవాత బీజేపీ మద్దతునిస్తూ ప్రకటించిన లేఖని ఆయనకు అందించారు. ఈ రెండు లేఖలనీ గవర్నర్ ఆమోదించడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. నితీశ్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో బీజేపీ నేత విజయ్ సిన్హా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరపున బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 8 మందిని మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మహాఘట్‌బంధన్‌లో చాలా సమస్యలున్నాయని, మునుపటి బలం ఆ కూటమిలో కనిపించడం లేదని రాజీనామా తరవాత తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. అందుకే బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. అటు I.N.D.I.A కూటమిపైనా విమర్శలు చేశారు. కూటమి ఏర్పాటైందనే తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని మండి పడ్డారు. మాట్లాడుకోడమూ మానేశామని తెలిపారు. ఈ కారణాల వల్లే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు.
Also Read: Pakistan Election 2024: హంగ్ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్ ఓటర్లు, ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ