జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా, ఆయనపై ఓ వ్యక్తి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో మాజీ ప్రధాని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఛాతీపై బుల్లెట్లు తగిలినట్లుగా అక్కడి వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. రక్తం కారుతున్న ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, కుప్పకూలిన తర్వాత ఆయనలో ఎలాంటి చలనం లేదని స్థానిక పత్రికలు రాశాయి. అత్యంత విషమ పరిస్థితిలో ఆయన కండిషన్ ఉండగా, చికిత్స పొందుతుండగా తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం శుక్రవారం (జూన్ 8) సాయంత్రం 5.03 నిమిషాల‌కు షింజో మృతిచెందిన‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.


Also Read: Shinzo Abe Attack Photos: జపాన్ మాజీ ప్రధానిపై గన్ ఫైర్, దుండగుడ్ని పట్టేసిన పోలీసులు - లైవ్ ఫోటోలు


శుక్రవారం (జూన్ 8) ఉదయం ఏం జరిగిందంటే..
జపాన్ మాజీ ప్రధాని అయిన షింజో అబే శుక్రవారం ఉదయం ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా 40 ఏళ్ల ఓ వ్యక్తి కాల్పులు చేశాడు. పశ్చిమ జపాన్‌లో ఈ ఘటన జరిగినట్లుగా ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ NHK వెల్లడించింది. ఈ నేరానికి పాల్పడ్డ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపింది. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో షింజో అబే ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న NHK రిపోర్టర్ మాట్లాడుతూ.. అదే సమయంలో ఒక గన్ షాట్ శబ్దం తాను విన్నానని తెలిపారు. కాల్పుల వల్ల మాజీ ప్రధాని పడిపోయారని, ఆయనకు చాలా రక్తం పోయిందని కూడా చెప్పారు.


అక్కడి అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షింజో అబే స్పృహ తప్పి పడిపోయారని, ఆయన ఎలాంటి కదలిక లేకుండా ఉన్నారని చెప్పారు. తుపాకీ కాల్పుల అనంతరం ఆయనకు బాగా రక్తం కారుతుండగా, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రిపోర్ట్ చేశాయి. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అత్యంత విషమ పరిస్థితిలో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.


Also Read: Shinzo Abe Attack Photos: జపాన్ మాజీ ప్రధానిపై గన్ ఫైర్, దుండగుడ్ని పట్టేసిన పోలీసులు - లైవ్ ఫోటోలు


2020లో ప్రధాని పదవికి రాజీనామా
షింజో అబే తన పదవికి 2020లో రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాలతో అప్పుడు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కానీ రాజ‌కీయంగా మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. తరచూ మీడియాలో కూడా కనిపిస్తుండేవారు. నాటో స‌భ్యుల త‌ర‌హాలోనే అణ్వాయుధాల షేరింగ్ అంశాన్ని జ‌పాన్ చ‌ర్చించాల‌ని ఫిబ్రవ‌రిలో ఓ డిబేట్‌లో తెలిపారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా అటాక్ చేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు.